పుట:కాశీమజిలీకథలు -02.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

90

కాశీమజిలీకథలు - రెండవభాగము

నేర్పరచి యాదారువు దేవతావిగ్రహములుగా జేయించి స్థాపించెదను. అమ్మహాసముద్రమధ్యమందున్న సమయంబున నట్లు సంకల్పించుకొంటిని. ఇప్పుడా మ్రాని నిచ్చటికి దీసికొనివచ్చుటకు దగువారి నియమింపుము. మరియు శిల్పికర్మవిశారదుల రప్పించి గొప్ప యాలయముల గట్టింపవలయు అంత దనుక నేను మన పురమునకు రాను. అట్టి ప్రయత్నమంతయు శీఘ్రకాలములో జరుగవలయునని పలికిన సంతోషింపుచు విజయుడప్పుడే పెక్కండ్ర జనులచేత నా మంచిగంధపు తరువును పైకిలాగించి యొక స్థలములోనుంచి అప్పటినుండియు బూజాసంస్కారములు జరుపుచుండెను.

మరియు సమర్దులగు శిల్పికారుల రప్పించి కడువిచిత్రములైన యాలయముల గట్టించెను అంతనద్దారువు విగ్రహముగా జేయు సమర్దుడెవ్వడో యని యాలోచించుచుండగా నొక నాడాకస్మికముగా నొక శిల్పివచ్చి అయ్యా నేను విగ్రహములు శాస్త్రీయముగా చేయగలను. శిల్పశాస్త్రమంతయు జూచితిని. సెలవిచ్చినచో మీ చిత్తమువచ్చిన విగ్రహముల జేసెదనని చెప్పెను. అందులకు సమ్మతించి యింద్రద్యుమ్నుడు సామగ్రి యేమికావలయునని యడిగిన అతం డయ్యా! నా కేమియు అక్కరలేదు. నీ విగ్రహంబుల నొకరహస్యగృహంబున దెరవైచుకొని చేయుచుందును. నాయంతట నేను సమాప్తమైనవని చెప్పువరకు నా తెరలోపల కెవ్వరు రాగూడదు. వచ్చినచో బ్రమాదమగును. ఇదియే నాకు మీరు చేయవలసిన పని అని జెప్పిన అందులకు సమ్మతించి అట్టి రహస్యస్థల మతని కేర్పరచిరి.

పిమ్మట నా శిల్పి యాదారువు నందు జేర్పించి తెరవైచుకొని విగ్రహంబుల జేయ మొదలుపెట్టెను. అట్టి సమయమున నింద్రద్యుమ్నుడు ప్రతిదినము ప్రాతఃకాలంబున బ్రాహ్మణులకు అనేక గోదానంబులు కొమ్ములయందును డెక్కల యందును బంగారముంచి జగంబెన్న జేయుచుండెను. మరియు నతండు జేయు నితరదానంబునకు లెక్కయేలేదు. పెక్కేల అతండు దానము జేయునపుడు బ్రతిదినము పొద్దుటమందగా నిలిపిన గోవుల డెక్కలరాయిడిచే నానేలయంతయు బల్లమై యగాధమైన తటాకమైనది. అదియేకదా? మనము తీర్ధమాడిన సరస్సు దానంబట్టియే దాని కింద్రద్యుమ్న మనుపేరు వచ్చినది

అట్లు రెండుమూడు సంవత్సరములు జరిగినను నా శిల్పి తెరదీసికొని వెలుపలకు రాలేదు. దానికి శంకించుకొనుచు అయ్యా? ఆలయంబులు సిద్ధముగా నున్నవి. విగ్రహంబులపని పూర్తికాలేదు ఎన్నిదినంబులైన నాశిల్పి యీవలకు రాడు బ్రతికి యుండెనో లేదో అని అనుమానంబు గలుగుచున్నది. ఇన్నిదినంబు లూరకుండుటయు దప్పేయని నిశ్చయించి యాఱే డొకనాడు సాయంకాలంబున మెల్లన బోయి అచ్చటనున్న దెరయెత్తి అతండేమి చేయుచున్నవాడో యని తొంగిచూచెను.

అప్పు డం దెవ్వరును గనంబడలేదు. విగ్రహంబులు మాత్రము కరచరణశూన్యముగా దక్కిన యవయవంబులు బూర్తిచేయబడినవి మిక్కిలి చక్కగానున్నవి.