పుట:కాశీమజిలీకథలు -02.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంద్రద్యుమ్నుని సముద్రప్రయాణము కథ

89

అయ్యో ! నాకు మంచివార్త దెలిపితివి. వారు నాకు బంధువులు, వారి జయము వినుటచే నాకు గొంత చింత మానినది. అని అతనితో మాటలాడచు నాడు పయనము మాని హేమాంగదుని బంధువులతో గొంత ముచ్చటించి పోయెదంగాక యని నిశ్చయించి యప్పుడు కోటయొద్దకు బోయితిని.

అప్పటికే శత్రురాజులం బారదోలి హేమాంగదుని యల్లుండు మదనుడు గూతురు విశాలాక్షి సేనలతో గోటలో బ్రవేశించినట్లు తెలిసినది. వారి ప్రవేశమును గురించి అచ్చటివారందరు నద్భుతముగా జెప్పుకొనుచుండిరి. శత్రురాజుల స్త్రీలను చెర బెట్టక గౌరవముగా వారి మగల యొద్దకు బంపిన విశాలాక్షి దయాహృదయమును గురించి చేయు స్తుతివాక్యములు నాకు సంతోషము గలుగజేసినవి.

అప్పుడు నేను సంతోషించుచు నా పేరును తండ్రి పేరును గ్రామము పేరును వ్రాసి దర్శనార్దమయి వచ్చి ద్వారముననున్నానని పత్రిక లోనికి నంపితిని. వాని నంపినక్షణములో మదనుండు నాయొద్దకు వచ్చి నన్ను సగౌరవముగా దన యంతఃపురమునకు దీసికొనిపోయి భార్యకు జూపెను. ఆమెయు నన్ను సోదరీభావంబున మన్నించి గద్దియనిడి కుశల బ్రశ్నముసేయుచు నేనడిగినంత తన వృత్తాంత మంతయు జెప్పినది. అప్పుడు నేను పట్టరాని మోదముతో నా వృత్తాంతమంతయుం జెప్పి యాయూరిలో సన్యాసి చెప్పిన వర్తమానము సైతము తెలియజేసితిని. దానికి వారు సందియమందుచు నీదంపతు లిన్ని దినములు నీటిలో నుండుటకు కతంబేమియో యని తలపోసి మిమ్మునరయుటకై నాతో గూడ వారును ప్రయాణమైరి.

ఆ కోటకు దగిన కావలియుంచి మేమందరము బయలుదేరి దారిలో మీరు పడిన యిడుమల జెప్పికొనుచు గొన్నిదినముల మొదట మన పట్టణమునకు వచ్చితిమి. అందు మీ జాడ యేమియు దెలిసినది కాదు. వెంటనే బయల దేరి యాసన్యాసి మాట దలచుకొనుచు మొన్నటికీ తావు జేరితిమి ఇందు శిబిరములచే గ్రామము గట్టించి మీరాక వేచుచుండ మా పురాతనసుకృతవిశేషంబున మీరు వచ్చితిరి. మిమ్ము గాంచి కృతార్ధులమైతిమి. దైవము మా కాసన్యాసి రూపమున వచ్చి చెప్పిన ట్లూహించెదము. లేకున్న నిష్కారణ మడుగకుండ నతం డేమిటికి జెప్పును. దైవకృపచే మన కిప్పటికి మంచిదినములు వచ్చినవి. ఇదియే నా వృత్తాంతమని చెప్పిన రాజు మిగుల కుతుక మందుచు నతనితో నిట్లనియె.

వత్సా! మనల గర్మసూత్ర మిన్ని దినములు ద్రిప్పినది గానిమ్ము. గతమునకు వగవనేల నిప్పటికి దైవానుగ్రహము గలిగినది. మరియు నొకటి వినుము మమ్ము సముద్రములో మునుగకుండ జందనదారు స్వరూపమున వచ్చి భగవంతుడు గట్టున దాటవైచెను. ఆదారువునందు నాకు దైవభక్తి కలిగినది కావున నిందు క్షేత్రముగా