పుట:కాశీమజిలీకథలు -02.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

88

కాశీమజిలీకథలు - రెండవభాగము

నాథు నర్చించుచు గంగాస్నానమున బాపముల నిర్జించి పూర్వజన్మోపార్జతఫలంబున గొన్నిదినంబు లందు వసించితిని.

ఒక్కనాడు సాయంకాలమున విశ్వేశు దేవళమునకు బోయిన నందు నప్పటి యప్పట్టపురాజు మహాపూజ చేయుచుండుటచే లోనకిబోవ నవసరముజిక్కినది కాదు. నన్ను బ్రతీహారులు దూరముగా ద్రోసివేసిన నేను నానీచవృత్తికి జింతాక్రాంతుడనై అయ్యో చక్రవర్తికుమారుండైన యిట్టి వారిచేత నవమానితుండనై తినే ఇది కాల మహిమయేకదా నా గౌరవమిచ్చటి వా రెవ్వరెరుంగదురు ? యేమిచేయుదును అని చింతించుచు నా వీధివేదికపై గూర్చుండి యుండగా నందొకసన్యాసి నాయవస్థ యంతయు గ్రహించి నన్ను గౌరవముగా మన్నించి మెల్లననిట్లనియె అయ్యా! నీ వెవ్వడవు? నీ దేశ మెచ్చట? ఇచ్చట కెప్పుడు వచ్చితివి. నీ వేమిటికో విచారింపుచున్నావు. కారణమేమి నీవృత్తాంతము మెరిగింపుమని యకారణస్నేహముగా నతండడిగిన నేనును నావృతాంతమాద్యంత మెరింగించి నమస్కరింపుచు అయ్యా! తమరు త్రికాలవేదులు మీరెరుగని రహస్యములుండవు. నాతలిదండ్రులెచ్చటనున్నారో చెప్పుడని అడిగితిని అమ్మహానుభావుడు నాదీనాలాపము లాలించి దయారసంబు చిలుకపలుకులచే నన్నోదార్చుచు వత్సా! మీ తండ్రి జగధ్వితుండు. కడుధర్మాత్ముండు. అతండు చిరకాలజీవి. యతని విషయము నీవు చింతింప నవసరములేదు. వానియున్న తావు చెప్పెద వినుమని యెద్దియో గణించి యిప్పుడు మీ తల్లిదండ్రులు నీటిలో జిక్కులుపడుచున్నారనియు నాషాఢశుద్ద పాడ్యమి నాడుదయమునకు నోఢ్రదేశమున నీరేవునకు వత్తురని నప్పటికి నీవచ్చటికి బొమ్మనియుం జెప్పెను.

అతితాగతముల గుర్తెరింగిన యుమ్మహర్షి వచనంబులువిని నేను మితిలేని సంతోషముతో నతని యడుగులంబడి మ్రొక్కుచు నతని యనుమతివడసి యమ్మరునాడు మా గ్రామమునకు బయనమై పోవ బ్రయత్నించు సమయమున నయ్యూరిలో హల్లకల్లోలముగా జనులు వీధుల గ్రుమ్మరుచుండుట జూచి యిదియే మని అడిగితిని. అప్పుడు నాతో నొకడు అయ్యా ! ఈ దేశపురాజైన హేమాంగద మహారాజుగారి అల్లుండును గూతురునువచ్చి కోటలో బ్రవేశించి అందున్న శత్రురాజును బారదోలుచున్నారట. వారు ప్రచ్ఛన్నముగా గోటలో దూరిరట. పాపము శత్రురాజు లాలుబిడ్డల విడిచి పారిపోవుచున్నారు. వారిని సైనికులు తరుమ గంగానది నోడలందాటుచు గొందరు భీతిచే నందులో బడిపోయిరట అన్నన్నా! యెంత యాపదవచ్చినది? వారి కట్లు కావలసినదే, పాపము హేమాంగదుడు పరలోకగతుండైన వెనుక యున్నవారు చిన్నవారని గ్రహించి నిష్కారణముగ గోటముట్టడించి వారిని బారదోలలేదా? యిన్ని దినములెచట దాగియున్నదో హేమాంగదుని కూతురు. విశాలాక్షి మహాబుద్దిశాలిని యుండియుండి తగిన సేనలం గూర్చుకొని శత్రువులం బారదోలినది ఈ యలజడి యంతయు నదియని చెప్పగా నేను మిగుల సంతసించుచు వారికి బారితోషికమిచ్చి