పుట:కాశీమజిలీకథలు -02.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంద్రద్యుమ్నుని సముద్రప్రయాణము కథ

87

డాషాఢశుద్ధపాడ్యమి, వారము శుక్రవారము, నక్షత్రము పునర్వసు ఇప్పుడే బ్రాహ్మణుడు చెప్పిపోయెనని చెప్పెను.

ఆ మాటలు విని రాజు ముక్కున వ్రేలువైచుచు బోటీ! వింటివా మన విజయుడు మనల వెదకుచు నిచ్చటకే వచ్చెనట. అన్నా! భగవత్సంకల్ప మిట్టిది కాబోలు. మనము సముద్రములో మూడుసంవత్సరములు చిక్కుబడినట్లు వీడు చెప్పిన కాలపరిమాణమున దెలిసినది కానిమ్ము. వేగరము బోవుదము రమ్మని పలుకుచు జనుల నడిగి తెలిసికొనుచు విజయుని శిబిరములకు బోవునంత ద్వారపాలకు అడ్డము వచ్చి అయ్యా! ఇప్పుడే కాశీరాజుగారు మలయాళదేశపురాజుగారును లోనికిబోయిరి. విజయమహారాజుగారితో వారెద్దియో యాలోచించు చున్నవారు తమరిప్పుడు పోవుటకు సమయముకాదు. పోవలదని చెప్పిన వాని కత డిట్లనియె.

ఓరీమూఢా! మీతండ్రియగు నింద్రద్యుమ్నుడు వచ్చియున్నవాడని మా విజయునికి జెప్పిరమ్మనగా వాడు తెల్లపోవుచు నేమేమీ? తమరింద్రద్యుమ్న మహారాజుగారా? యిట్టిరూపముతో నున్నా రేమి. నాయపరాధము క్షమింతురుగాక యని పాదముల వ్రాలుచు మన పెద్దరాజుగారు వచ్చినారో అని అరచెను. ఆ ధ్వనివిని అందరు తొందరపడుచు నేమేమి! అని వాని దాపునకు వచ్చిరి. వాడును గడువేగముగా లోనికిబోయి విజయునితో దమ తల్లిదండ్రులు వచ్చినారని చెప్పగా నమృతోపమానములగు వాని మాటవిని అతండు దిగ్గునలేచి యెక్కడెక్కడ అని పలుకుచు బరుగెత్త జొచ్చెను. ఎదురుగా వచ్చిన విజయుని జూచి కన్నుల నానందబాష్పములు గ్రమ్మ నాయిరువురు పెద్దతడవు గాఢాలింగనములు చేసుకొని డగ్గుత్తికచే మాటరాక సంతోషదృష్టులచే నొండొరుల జూచుకొనుచుండిరి. అంతలో మదనుడు విశాలాక్షియు వచ్చిరి. వారింజాచి యారాజు ఓహో మాబంధువ్యూహంబంతయు నిచ్చటనే యున్నదే యీ దినంబెంత సుదినము అని మెచ్చుకొనుచు వారిని గుశలప్రశ్నజేసెను.

వారందరు శిబిరములోనికి బోయి యందు గూర్చుండి యొండొరుల క్షేమసమాచారము దెలిసికొనుచుండగా, నింద్రద్యుమ్నుడు తన వృత్తాంతమంతయు నామూలచూడముగా విజయునకు జెప్పి నీ విప్పు డిచ్చటి కెట్లు వచ్చితివని అడుగగా నితండిట్లనియె. తండ్రీ! మీరు కానకుబోయిన గొన్నిదినములకు మన సైనికులు వచ్చి యచట జరిగిన విశేషములన్నియుం జెప్పిరి. మా యమ్మను దారిలో శబరసైన్యము వచ్చి యడ్డగించుకొని తీసికునిపోయిన వార్త వినినతోడనే నేను మిగుల బరితపించుచు జతురంగబలముతో బయలుదేరి యయ్యరణ్యములన్నియు నరసితినిగాని యెందును యీయమ జాడ గనంబడినది కాదు.

అది మొదలు నేను స్వస్థతలేక రాజ్యము మంత్రియధీనము జేసి ప్రతి యూరు ప్రతి అరణ్యము ప్రతిపల్లెయు వెదకుచు బెక్కుదేశములు తిరిగితిని. నేను శోకించుచు మాతృపితృహీనంబయిన నగరంబు సొరనొల్లక వైరాగ్యంబు వహించి దేశాటనముచేయుచు గ్రమంబున గాశీపురము నరిగితిని. అందు పరమభక్తితో విశ్వ