పుట:కాశీమజిలీకథలు -02.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంద్రద్యుమ్నుని సముద్రప్రయాణము కథ

85

మునుగునంత వడిగా విసరినది. అప్పుడు పర్వతమువలె నలలు కొట్టుకొనుటచే నాయోడ నిలువలేక యొరిగి సముద్రములో మునిగిపోయినది.

అందున్న జనులందరు నప్పుడు హాహాకారరవముతో భగవన్నామస్మరణము చేయుచు దమకు దొరకిన సాధనములం బట్టుకొని సముద్రములో దూకిరి. అప్పుడింద్రద్యుమ్నుడు భార్యను బిగ్గరగౌగలించుకొని చిత్త మీశ్వరాయత్తము చేసి కొని మహాసాహసముగా సముద్రములో దూకెను. అప్పు డతని కేమియు దెలియలేదు. పిమ్మట గొంతసేపు నీళ్ళలో మునిగి కొంతదూరము పోయి పైకి తేలినట్లు దెలిసినది ఎంత వైరాగ్యము గలిగియున్నను మృతియన వెరువకమానరు.

అతను నీటిపై దేలినప్పుడు తన సందిటనుండి చిత్రసేన జారిపడినదని తెలిసికొని మితములేని శోకముజెందియు నామున్నీటితరంగములలో నోపినకొలది నీదుచుండెను. ఆహా! ప్రాణ మెంతతీపైనదో చూచితివా. బాహువునచే సముద్రము నీద దొడంగిన యతని యుద్యమము నూతబడినవాడు దరినున్న గడ్డిపోచను నూతగా బూన దలంచునను సామెతను దృఢపరచుచున్నది. కొంతసేపట్లు భుజములచే నీది యీది యాయాసముజెంది మనంబున నిట్లు తలంచెను.

అయ్యో! అజ్ఞానపురుషుడు మోహాంధుడై దరిలేని సంసారసాగరమువోలె నే నీసముద్రము నీదుట దరిజేరుటకే! యెంతదూర మి ట్లీదగలను. శ్రమ బలియుచున్నది. నేను బ్రతికియున్న లాభములేదు. ప్రాణతుల్యయగు భార్యను గోలుపోయితిని. ఇక బ్రతుకు మీద నాస యేలకలుగ వలయును? నేను గూడ మృతినొంది ప్రాణనాయికిం కలిసికొందు. మరణావసానంబున భగవదారాధన సేయుట యుచితముగదా. అమ్మహాత్ముని హృదయంబున నిలిపి పరమపదంబు నొందెదనని పెక్కు గతుల దలంచుచు మనంబీశ్వరాతత్తంబు గావించి మరణకృతనిశ్చయుండై యీదుట మానివేసెను. అప్పు డతనికి నాసాపర్వముగ నొక యద్భుతమైన పరిమళము గొట్టినది. అట్టి సువాసనకు వెఱగందుచు నతండు గన్నులం దెరచిచూడ దాపున నొక దారువు గొప్ప తరంగమును బోలి గొట్టుకొని వచ్చుచున్నది. దానిం జూచి యది యోడఁగూర్చిన దారువుగా నిశ్చయించి దానిదాపునకు గొంచెమీదెను.

అదియు నీటివాలున తన కభిముఖముగా వచ్చుచున్నది. కావున వేగిరమే దానింజేరి పైకెక్కెను. అదియు నోడవలె విశాలమై గూర్చుండుటకు నుపయుక్తముగా నున్నది. దానిమీద నొక వనిత పండుకొని యున్నది. ఆమెంజూచి తనయోడలో నొకతె దీనిం గ్రహించెనని నిశ్చయించి మరలదాని పరిమళము పరీక్షించి మంచిగంధపుతరువుగా దెలిసికొని యట్టిది యోడకేల గట్టెదరని శంకించుకొనియెను. తరువాత నతం డానాతిని లేపి నీవెవ్వతె వీదారువున నేమిటికి వసించితివని యడుగగా నాచేడియ శోకభరముతో గన్నులు దెరువకయే హా ! ప్రాణేశ్వరా ! నన్ను విడిచి సముద్రములో మునిగిపోయితివే. నేనుగూడ మునుగకుండ నీయాధారమేటికి దొరకవలయును. ఈ