పుట:కాశీమజిలీకథలు -02.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

74

కాశీమజిలీకథలు - రెండవభాగము

అద్భుతపుష్పముకథ

అయ్యా! నేనొక్కనాటి మధ్యాహ్నపువేళ నొకయడవిమార్గమున బోవుచుండగా నొకచెట్టుక్రింద జక్కని చిన్నదియొకతె కూర్చున్నది ఆమె కన్నులు తెల్లతామరరేకులవలె సోగలై కర్ణముల పర్యంతము వ్యాపించియున్నవి. శరీరచ్చాయ పచ్చనిది. తెల్లనిచీర గట్టుకొని యున్నది. నగలేమియును లేకున్నను దేవకన్యవలె బ్రకాశించుచున్నది. ఆమె ప్రక్కనొక్క పెద్దగుఱ్ఱ మున్నది. దానినెక్కి ఎక్కడికో పోవుచున్నది. ఆచిన్నది నాదరిద్రమంతయును విని జాలిపడి కొంతసే పెద్దియో యాలోచించి తన చెంగున మూటగట్టియున్న ఈ పుష్పము నాకిచ్చి ఎల్లకాలము నీకుటుంబము పోషించువారికే ఈ పుష్పం బియ్యవలయునని చెప్పి యామె ఎచ్చటకో పోయినది.

ఆమెను నాభాగ్యదేవతనుగా భావించి యామె చెప్పినమాటలు మంత్రోపదేశముగా జపించుకొనుచు నాకనాటి సాయంకాలమున కొక యూరుచేరితిని. ఆ గ్రామము పేరెద్దియో నేనెరుగను. నేను గ్రామములో ప్రవేశింపకమున్నే యిద్దరు మనుష్యులు గుర్రము లెక్కి విహారర్థమై పోవుచు నాకెదురుపడిరి.

అట్లు గుర్రములెక్కి వడిగా బోవుచున్న వారిని నా మూటలోనున్న పుష్పపరిమళముసోకి యడుగయినను గదలనిచ్చినది కాదు అపూర్వమైన యాసువాసనకు వారు వెఱగందుచు నలుమూలలు వెదకుచు నాయొద్దకువచ్చి బ్రాహ్మణుడా! నీ యొద్దనేమైనను బరిమళద్రవ్యమున్నదియా అని యడిగిరి.

లఘుబుద్ధినైన నేనాగుట్టుదాపలేక వారి మాటవిని ఔను. ఉన్నది. ఇదిగో అద్భుతమైనపూవని యా మూటవిప్పి వారికి జూపితిని. వారు దానింజూచి మిక్కిలి యక్కజమందుచు నీకీ పూవెక్కడదని యడిగిన గుట్టు దాచక యథార్ధమంతయుం జెప్పితిని. ఆ మాటలు విని వారు మిగుల సంతోషించుచు అయ్యా, మీ కుటుంబము నెల్లకాలము మేము పోషించెదము. మా యింటికి రండు ఈ పుష్పము మాకిమ్మని వేడుకొనిరి. వారి మాటలకు నేను సంతోషము జెంది నాకుటుంబమును మీరు పోషించుటకు ద్రికరణములచేతను బాధ్యతపడియెదరేని యిప్పుడే యీ సుమము మీకిచ్చుచున్నానని పలికి ముమ్మారువారిచే బ్రమాణికము జేయించి యా ప్రసూనరాజము వారి కిచ్చితిని.

పిమ్మట వారు మమ్ముదమయింటికి దీసికొనిపోయి చెప్పిన ప్రకారము గౌరవముగా బోషింపుచుండిరి. ఆజన్మదరిద్రులకు స్వల్పలాభము సైతము రాజ్యపదవిగా దోచుచుండును. వారు చేయుచున్న భోజనము మాత్రపు సదుపాయమే నాకు బట్టాభిషేకములాగున దోగుచున్నది. మొదట నేను వారిద్దరు నొక్కటియే అనుకొంటిని