పుట:కాశీమజిలీకథలు -02.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

70

కాశీమజిలీకథలు - రెండవభాగము

లేదు. మీపెట్టెలోనిదేయని తలంచుకొని యుండుడు. ఇప్పుడే దానికి మనుష్యుని పంపుచున్నానని చెప్పెను. వర్తకులమాయ లెవ్వరికిదెలియును? వానిమాటలు యథార్థము లేయని యప్పటికి బసలోనికి బోయితిని. మరునాడుదయముననే నా కుబేరదత్తుని ఇంటికి బోయితిని! ఆతండు నన్నుజూచి అయ్యో! తెల్లవారకుండ వచ్చితివేమయ్యా! యూరికిబోయిన మనుష్యుడు రావలయునా? మీసొత్తున కేమియు భయము లేదు. ఒకవేళ వాడు మధ్యాహ్నమునకు వచ్చునేమో! తమరు సాయంకాలమున రండి. మీసొమ్ము తీసికొని పొండని సమాధానపరచి మరల బసకు బంపెను.

అతడు చెప్పినప్రకారము నేను సంజవేళ వానియింటికి బోయితిని. అప్పుడు నన్నుజూచి అయ్యా! ఆకూలివా డింకను కాలేదు కారణమేమో తెలియదు. ఉదయమునకు దప్పకవచ్చును. ఇప్పటికి వెళ్ళి ప్రొద్దుటరండి అనిచెప్పెను. వానిమాట యథార్థమే యనుకొని అప్పటికిబోయి యుదయమున మరలవచ్చితిని. అప్పుడును వెళ్ళిన మనుష్యుడు రాలేదేయని చెప్పెను. ఆరీతి నాలుగుదినములు త్రిప్పి అయిదవదినమున మనుష్యుడు వచ్చినాడు కాని సొమ్ముతీసికొని రాలేదు, వారము దినములలో బంపెదనని అచ్చటివర్తకుడు చెప్పినాడట. అతండు నాకు బాకీయున్న వాడు. కాబట్టి మీరు వారము తాళివచ్చినచో మీసొమ్మంతయు నిచ్చెదమని చెప్పెను. అప్పుడు నే ననుమానము జెందుచు వర్తకుడా! నీకుసొమ్ము నిలువుగాయున్నప్పుడే కొనవచ్చును. ఈపాటికి నాపండు నాకిమ్ము. పోయెదనని యడిగితిని. అవ్వర్తకుండు అయ్యో! ఇంతమాత్రమునకే నన్ను నమ్మవా? అని యొండురెండుమాడ లైనచో నెక్కడనైన, సర్దుదును నిలవంబడి నూరురూకలు తెమ్మన్న నెట్లుతెచ్చును? ఆనక రండు యెక్కడనో చూచి యిచ్చెదనని చెప్పెను. అప్పుడు నేను తొందరపడుచు నేమీ ! నూరురూకలా? నామొగమువంక దిన్నగాజూచి చెప్పుము. నేను దీని నీ కమ్మను. నాఫలము నాకుదెమ్ము నీపాటివారా దానిఁగొనువారని యుగ్రముగా బలికితిని.

నా మాటవిని యా కోమటి యో వెఱ్ఱిబ్రాహ్మణుడా! నిజముగా నాఫలమునకు లక్షరూపాయ లితువనుకొంటివి గాబోలు నీవు గ్రామమనియు ముఠాయనియు పలికినమాటలువిని యపేక్షకు నద్భుతపడి లక్షరూపాయలని పరిహాసముగా నంటినిగాని యది యథార్థముకాదు. ఊరక వెర్రియాశపడక నేనిచ్చిన దానితో సంతోషించి వెళ్ళుడు. నేను కావున నింతమాత్రమైన నిత్తునని చెప్పుచుంటిని రాజుగారైన నూరకయె పంపుదురు. అని చెప్పచు పదిరూపాయలు నాకియ్యవచ్చెను.

అప్పుడు నేను మిగుల నహంకారముచేయుచు నాకీసొమ్మక్కరలేదు. నాపండు నాకిమ్మని బలవంత పెట్టితిని. ఆ ఫల మిదివరకే తింటిమి. చేదుగానున్నది. దానిగుణ మేమియు నాకు గనంబడలేదు. నీ కాసబెట్టితిని గదా అని యిచ్చుచుంటిని. కాని అది కానియైన చేయదని యా కోమటి నాకు బదులుచెప్పెను. అతనిమాటలు విని నేను గుండెలు బాదుకొనుచు అయ్యో! ఈకోమటి నన్ను మోసపుచ్చి నాఫలము హరించి