పుట:కాశీమజిలీకథలు -02.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అద్భుతఫలము కథ

69

నావృత్తాంతమంతయు విని జాలిపడి నన్నోదార్చుచు మనంబున నెద్దియో ధ్యానించి పిమ్మట దనచెంగు ముడివిప్పెను.

అందు నీఫలమును పుష్పమును ప్రకాశించుచున్నవి. ఫలము మాత్రము నాకిచ్చుచు వడుగా! ఇదిమిగుల మహిమగలది. నీదరిద్రము తీర్చువానికే దీనినిమ్ము. సాధారణులకియ్యవద్దు. పోపొమ్మని నాకనుజ్ఞయిచ్చి యతండు గుర్రమెక్కి యెక్కడకో పోయెను. పిమ్మట నేను మిగుల సంతోషించుచు కాఫలమును పదిలముగా ధోవతిని మూటగట్టికొని మాదేశప్రభువగు నీధర్మాంగద మహారాజుగారి కిచ్చినచో నాకు గొప్పబహుమతి జేయునని నిశ్చయించి కతిపయప్రయాణముల నీధర్మపురి జేరితిని.

నేను వీధింబడి బోవుచుండగా నెన్నిపొరలలో నిమిడ్చి కట్టినను దీని పరిమళము నిలుపక దెసల వ్యాపింపం దొడంగినది. వీధియరుగున గూర్చుండిన కుబేరదత్తుడను కోమటి కావాసన కొట్టుటయు వీధింబోవుచున్న నన్ను దరికి బిలిచి బ్రాహ్మణుడా! మీ దేయూరు ఆబట్టలో నున్న వస్తువేమియని యడగెను. ఆ శెట్టి మిగుల భాగ్యవంతుడని యెఱిగియున్నవాడగావున గొప్పవానితో బొంకనేలయని యాతనితో నాఫలవృత్తాంతమంతయు జెప్పితిని. ఆకుబేరదత్తుండును నామాట విని నన్ను మిక్కిలి గౌరవముగా దనమేడమీదికి దీసికొనిపోయి యేదేది ఫలమెట్టిదో మూటవిప్పి చూపింపుమని తొందరబెట్టెను.

అప్పుడు నేను మెల్లన మూటవిప్పి యాఫలమతనికి జూపించితిని. దానిం జూచి యతండు మిగుల నద్భుతమందుచు బ్రాహ్మణుడా! దీని దినిన సంతానము గలుగునాయని యడిగెను.

ఆ సంగతి నాకుదెలియదు. నేనెఱింగిన సంగతి నీకుదెలియ జెప్పితినని యుత్తరము సెప్పితిని. తరువాత నత డయ్యా ! నీకు బదికాసు లిచ్చెద దీని నాకిచ్చెదవా యని యడిగెను. నేను రాజుగారికై దీని దీసికొనిపోవుచున్నాను. పదికాసులకు నిరువది కాసులకు నమ్మను. దీనివలన గ్రామముగాని ముఠాగాని రావలయునని కోరికయున్నది. సామాన్యుల కియ్యవద్దని మొదటనే యమ్మహాపురుషుడు చెప్పియున్నాడు. పోయివచ్చెద ననుజ్జయిమ్మ నిలేవబోవునంత నతండు నన్ను జేయిబట్టుకొని కూర్చుండబెట్టి కొసరికొసరి చివరకు లక్షరూపాయ లిచ్చెదనని చెప్పెను. అప్పుడతని మాటలకు మోమోటపడి నేను రాజుగారు మాత్రమింతకన్న నెక్కువనిత్తురా ? యీవిత్తమున నాయంతరము సుఖముగా గడుపుకొనవచ్చును. ఎక్కడికి? ఆశ కంతమున్నదియా యని సంతుష్టితో దానికి సమ్మతించి యాఫల మాశీర్వచన పూర్వకముగా నతనిచేతిలోనుంచి యాధన మిమ్మని యడిగితిని.

అతం డాఫలము నొకపెట్టెలో దాచి నన్ను వీథిలోనికి దీసికొని వచ్చి అయ్యా! ధనమంతయు నిప్పుడు సిద్ధముగాలేదు. రేపటియుదయమునకువచ్చును. శ్రమయని యాలోచింపక ప్రొద్దున్న దయచేయుడు. మీవిత్తమున కేమియు భయము