పుట:కాశీమజిలీకథలు -02.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కోయపల్లె కథ

67

వృత్తాంత మడుగుదమని తలంచుచున్నంతలో నక్కాంతారత్నంబు ఇదిగో లోనికి బోయివచ్చెద నిందుండుమని గర్భాలయములోనికిబోయి మరల గనంబడినదికాదు. ఆమె మరలవచ్చునని పెద్దతడవచ్చట గాచుకొనియుంటిని. గాని ఎంత సేపటికినీ నామె జాడ గనంబడినదిగాదు. నేను గర్భాలయములోనికి బోయి వెదకితిని. అందును లేదు.

అప్పుడు అన్నన్నా! ఆ చిన్న దానిచేయి గట్టిగా బట్టుకొని యడుగక యూరక విడిచిపెట్టితినే! ఇప్పు డే మనుకొన్నను లాభము లేదు. ఆమె విశాలాక్షి కాప్తురాలుగా దోచుచున్నది. దానంబట్టియే నాయందును దయగలిగియున్నది. ఇట్టిచిత్ర మెవ్వరితో జెప్పినను నమ్మరుగదా! ఫలపుష్పములు రెండును అమ్మవారు నాకిచ్చినట్లు చెప్పినది. అద్దేవి ప్రచ్ఛన్నముగా నన్ను కాపాడుచునే యున్నది. అమ్మహాదేవినే నమ్మియుంటి నెట్లుచేసినను లెస్సయేయని పలువిధంబుల దలంచుచు మరల వెలపటికివచ్చి యచ్చేడియను వెదకితిని కనంబడలేదు.

పిమ్మట నేనక్కడబయలుదేరి యశ్వయానమున మరునాటి సాయంకాలమునకు ధర్మపురియను రాజధానిం జేరితిని. అరాత్రి యొక సత్రమువేదిక పై బండుకొని యున్న సమయంబున నందు గొందరు బ్రాహ్మణు లిట్లు సంభాషించుకొనిరి.

సుబ్రహ్మణ్యశాస్త్రి - ఆ వీధినట్లు జనులు గుంపులుగా బోవుచున్నా రెక్క డికో ఎరుంగుదువా!

రామశాస్త్రి - ఎఱుంగుదును. రాత్రి గోటలో గొప్పసభ జరుగునట.

సుబ్రహ్మ - సభావిశేషము లేమి ?

రామ — ధర్మాంగద మహారాజుగారి దివాణమున కొక యద్భుతమైన ఫలమువచ్చినదట దానిజాతి యిట్టిదని ఎవ్వరును జెప్పలేకపోయిరి. అదియెన్ని దినములుండినను వాడదు. మనోహరమైన పరిమళముగలిగియున్నది. దానిందినిన నేమిజరుగునో ఎవ్వరికిని దెలియదు. అట్టి ఫలమునుగురించి యుపన్యాసమిచ్చుటకు నీరాజు నానాదేశములకు వర్తమానములు పంపెను. దానికై పెక్కండ్రు మహారాజులు వచ్చిరి. ఈరాజు స్నేహితుడు మళయాళదేశపురాజు చండవర్మ యను నాతడుగూడ యద్భుతమైన పుష్పమును దెచ్చెనట. అదియు నెన్నిదినములున్నను వాడదట. దాని పరిమళము యోజనదూరము వ్యాపించును. చూడగా నా రెండు నొకజాతివృక్షమున బుట్టినవియేయని వాసనంబట్టి చెప్పిరి. వానింగురించి ఉపన్యాసములు జరుగును. పిమ్మట సభాసదులు వినోదము నిమిత్తము మదనమంజరియను వేశ్య సంగీతముపాడును. ఇవియే సభలో జరుగు విషయములని చెప్పెను.

వారిమాటలు విని నేను తటాలునలేచి యాఫలపుష్పముల గురించి ఏమేమి మాట్లాడికొనియెదరో వినియెదంగాకయని నిశ్చయించి స్త్రీవేషముతో సభకు పోరాదని తలంచి పురుషవేషము వైచికొని యాసభకు బోయితిని. ఆసభ చక్కనిదీపములచేతను వింతవస్తువులచేత గద్దియలచేత నలంకరింపబడి యున్నది. ఆసభామధ్యంబున నా