పుట:కాశీమజిలీకథలు -02.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

62

కాశీమజిలీకథలు - రెండవభాగము

పలికిన నవ్వడుగు నుడువులు విని నేను మిగుల జాలిపడి బ్రాహ్మణుడా ! నీవు వెరవకుము. నీయావడి యుడిగించెదను. "జీవన్భద్రాణిపశ్యతి" యను నార్యోక్తి గలదు. అని యోదార్చుచు నాకొంగు ముడినున్న పండుతీసి ఆతని చేతిలో బెట్టి యిట్లంటిని.

వడుగా ! ఈఫలము మిగులమహిమగలది. ఎన్నిదినములున్నను వాడక ఇట్లే యుండును. దీనిని దినిన వారికి క్షుత్పిపాసలుండవు. మీదేశపురాజునకు దీనినిచ్చిన నీకు వలయునంత విత్తమియ్యగలడు. దాన యధేచ్ఛముగా జీవింపుము పోపొమ్ము. చావవలదని యతని మరణము తప్పించి యాఫలము నిచ్చి యంపితిని.

నేను నారాత్రి యాయగ్రహారములో బ్రచ్చన్నముగా నొకచోట బండుకొని యుదయమున లేచి మరల ద్రోవంబడి నడవజొచ్చితిని. అచ్చటనుండి యామార్గము తూర్పుగాబోయినది. అట్లు మధ్యాహ్నము దాక నడిచి యెండ మిక్కుటముగా నున్నది కావున కొంచెము విశ్రమించిపోయెదంగాక యని తలంచి యందొక చెట్టునీడ నా గుర్రమునుగట్టి యందు గూర్చుండి యా ప్రాంతవిశేషము లరయుచుంటిని.

అంతలో నొకముసలిబ్రాహ్మణుడు పదుగురుపిల్లలతో నా మార్గమున నెందేని బోవుచు నాతపభీతిచే విశ్రమించుకొరకు నాచెట్టునీడకే వచ్చెను. ఆతనిని జూచి నే నిట్లంటి. అయ్యా! తమ దేశ మెద్ది? ఎచ్చటికి బోవుచుంటిరి? ఈపిల్లలు మీ కేమగుదురు? మీ వృత్తాంత మెరిగింపుడని యడిగిన నతండు కంటనీరు నించుచు మెల్లన నిట్లనియె.

అమ్మా! మాది విదర్బదేశము. నా పేరు కృష్ణశర్మ. ఈపిల్లలు నాసంతానమే. నాభార్య ప్రసూతివికారమువలన స్వల్పకాలముక్రిందటనే పరలోకగతురాలయినది. ఈపసికూనలతో మిగుల చిక్కులు పడుచుంటిని. కడుబీదవాడను. వేరే యాడుదిక్కునులేదు. నిత్యము భిక్షాటనముచేత కాలక్షేపము సేయుచుంటిని. ఇప్పుడు మా దేశమందు వర్షములులేక క్షామముబుట్టినది. ఆ బిచ్చమైనను చాలినంత దొరకుటలేదు. ఎచ్చటకేనిం బోయిన జీవనములు నిలుచునేమో యని బయలుదేరితిని. కాని నాకన్న ముందరనే నాదురదృష్టదేవత నడుచుచున్నట్లు తలంచుకొంటిని. ఎచ్చటికిబోయినను యన్నము దొరకుటలేదు. మేము భోజనముచేసి రెండుదినములైనది. ఈపసిబాలురు నడువలేరు. ఆకలిదాళలేక యూరక యరచుచున్నారు. ఈకుటుంబభారము భరింపలేక బలవంతమున జచ్చిన బాగుండునని తోచుచున్నది. తల్లీ! నీవుచూడ మిగుల గౌరవము గలదానివలె తోచుచుంటివి. నాకేమైనం దయచేయుదువే అని కన్నీరునించుచు అడిగెను.

అప్పుడు నే నాతని దీనాలాపములు విని సహింపనేరక శివశివా యని చెవులు మూసికొనుచు నించుక చింతించి యిట్టి దరిద్రుని బాగుచేయుటకంటె పుణ్యము లేదని నిశ్చయించి నాయొద్దనున్న యా అద్భుతపుష్పము నాతని కిచ్చి యిట్లంటిని.