పుట:కాశీమజిలీకథలు -02.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భీమశర్మ యను బ్రహ్మచారి కథ

61

యొకరింటికిబోయితిని. అచ్చట బిండివంటలు శాకములు మొదలగు పదార్దములు దృప్తిగా దిని భోజనమైనవెనుక కొంతసేపచ్చట విశ్రమించి యింటికిబోయితిని. అప్పుడు మాపెద్దన్న భార్య నన్ను గోపదృష్టింజూచుచు భీమశర్మా! నీవు బోజనము జేసి వెంటనే యింటికిరాక యింత యాలసించితివేల యింటిలోని పనులన్నియు నెవ్వరు చేయుదరనుకొంటివి. ఈదివసమున మాత్రము భోజనముదొరికిన జాలునా? రేపక్కర లేదా ఏమి? నీవు మునుపటివలె గాదు మిక్కిలి ప్రాల్మాలుచుంటివని కసరుచు దానుయ్యెలలో బరుండి ఇంటిలో మంచినీరులేదు. బావికి బోయి కావడియెత్తుకొని రమ్మని యాజ్ఞాపించినది.

అప్పుడు నామనంబునంబొడమిన కినుక నాపుకొనుచు వదినా! నాకీదినమున భోజనము బరువైనది. దాననాయాసముచేత నింటికి రాలేక యచ్చటనే విశ్రమించితిని. ఇంకను నాయాసముదీరలేదు. ఇప్పుడు బావికి బోలేను. కొంచెముతాళి వెళ్ళెదనని యుత్తరము చెప్పితిని. దీనిలో నేమితప్పున్నదియో నీవేచెప్పుము తానుచెప్పిన మాట వింటినికాకని అహంకారముచేయుచు నౌరా, నేనుజెప్పిన పని చేయక యిక నాయింటిలో నుండెదవా, నీకెవ్వరో దుర్బోధచేయుచున్నారు. కానిమ్ము మీయన్న వచ్చినతరువాత నిన్నేమిచేయించెదనో చూడుమని పెక్కుదుర్భాషలాడినది. అప్పుడు నేను జడియుచు పోనీ నీకింత కోపము వచ్చినచో నిప్పుడే పోయెదనులే అని కావడి సవరించుకొని బిందె లందులో నుంచుకొనునంతలో దటాలున నుయ్యెలదిగివచ్చి యాకలశము లాగికొని ఛీ! నీవు మాకు నీరుతేవలదు తెచ్చిననీరు త్రాగినది మాదిగదే సరియని యొట్టుబెట్టుకొనుచు బెక్కుతిట్లు తిట్టినది.

ఏమమ్మా! నేనేమంటినని యింతకోపము చేసెదవు. ఆయాసముగా నున్నది గనుక ఆనకదెత్తునంటినిగాని నీకెదిరించితినా? ఈతప్పు గావుము ఇకనెన్నడిట్లననని ఎంతబ్రతిమాలినను నామె కోపము తీరినదికాదు. ఆమె గయ్యాళితనమునకు భయపడియో స్వభావము చేతనోకాని తక్కినవదినలు సైతము నాదే తప్పనిరి. కాని యామె నేమియు ననరైరి.

పిమ్మట నావిడ తలగట్టుకొని పండుకొని మగడువచ్చిన తరువాత నాపై లేనిపోని నేరములుచెప్పి యతని కహంకారముగలుగజేసినది. అతడెంతమాత్రము నిదానించక పెండ్లాము మాటనమ్మి నిర్బాగ్యుడా! నీవింతపోతరింతువేయని యరచుచు నన్ను లావుపాటి దుడ్డుగర్రతో జావమోదెను. అప్పుడు తక్కినయన్నలుగాని, యన్నల భార్యలుగాని యొక్కరైనను నడ్డపడరైరి. దిక్కుమాలిన నాబ్రతుకునకు నేను నిందించుకొనుచు దెబ్బలచే మేనంతయు నొచ్చినందున బ్రాణములం దిచ్చలేక ఎవ్వరికిని దెలియకుండ జావవలయునని యీ యడవిలోనికి వచ్చి యిట్లు చేయుచుంటిని. ఇంతలో నీవడ్డుపడితివి. యిదియే నావృత్తాంతము. పైన నేనేమిచేయవలయునో నీవే చెప్పుము. ఎంతయాపదయునులేక యూరక నేనుమాత్రము జావయత్నింతునా యని