పుట:కాశీమజిలీకథలు -02.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

60

కాశీమజిలీకథలు - రెండవభాగము

శీఘ్రముగాకాగలదని ధైర్యము మనంబున గుదురుపడ సంతతము పరిపూర్ణానందముతో నుంటిని. అట్టి సంతోషముతో లేచి యా పుష్పమును ఫలమును మరల పయ్యెద కొంగున మూటగట్టికొని యా గుర్రమెక్కి పశ్చిమాభిముఖముగా నడువ జొచ్చితిని. అప్పటికి జాము ప్రొద్దున్నది సాయంకాలము కాకమున్న యెద్దియేని యొకయూరు చేరవలయునని తలంచి తత్తడిని వడివడిగా దోలితిని. ఆ దారి కొంతదూరము పశ్చిమముగాబోయి పిమ్మట దక్షిణమునకు మరలినది.

భీమశర్మ యను బ్రహ్మచారి కథ

దానింబడి పోవబోవ సాయంకాలమున కొక అగ్రహారము దాపునకు జేరితిని. అం దిరువది సంత్సరములు ప్రాయముగల యొక బ్రహ్మచారి మ్రానుకొమ్మకు ద్రాడు బిగియించి అది తనమెడ కురిగా దగిలించుకొని ప్రాణముల బోగొట్టుకొనుటకు సిద్ధముగా నుండుట జూచి తటాలున గుర్రముదిగి నేను వాని చేయి బట్టుకొని ఇట్లంటిని. వటుడా! నీవెవ్వడవు? ఇ ట్లురిబోసికొని బలత్కారముగా మృతినొందనేల? ఆప్తు లెవ్వరును లేరా? ఈ తెగువకు గారణంబేమి అని మెల్లగా అడిగిన అతండు నన్ను గనుచీకటిలో గురుతుపట్టనేరక పురుషుడననుకొని నా కిట్లనియె. అయ్యా! నీవు నాచేయి వదలుము. నేను బ్రతికియుండినను లాభమేమియును లేదు. ఈ పడిన యిడుమలు చాలవా! లోకంబున దరిద్రుడును విద్యలేనివాడును బ్రతికియుండుటకంటె నీచము లేదు. అని పలుకుచు బెక్కుతెరంగుల బొక్కుచున్న యా చిన్నవానితో మరల నే నిట్లంటి.

విప్రుడా! నీజన్మముత్కృష్టమైనది. దరిద్రముచేత నీకుజావవలసిన యగత్యములేదు. నీవృత్తాంతము చెప్పుము. నిన్ను భాగ్యవంతుని జేసెదనని అనునయపూర్వకముగా నడిగిన అతండిట్లనియె. అయ్యా! ఇచ్చటికి గ్రోశదూరములోనున్న విజయపురి యను నగ్రహారము నా కాపురము. నాపేరు భీమశర్మయండ్రు. మే మేడ్వుర మన్నదమ్ములము. నేను గడపటివాడను. నాకు విద్యయేమియు నబ్బినదికాదు. దానం జేసి యందరకు బానిసవాడనై వర్తింపుచుంటిని. నాకు దల్లిదండ్రులు పుట్టినప్పుడే మృతినొందిరి. నేను మా అన్నలుచెప్పిన పనులు శ్రద్ధతో జేయుచు వారికిష్టముగానే మెలంగుచుంటిని. మావదినెలందరు కాపురమునకు వచ్చిన తరువాత సైతము నాకు దాసత్వము తప్పలేదు. మఱికొంతపని ఎక్కు వైనది. వారికిని నుపచారములు చేయవలసివచ్చినది. అందరకును దాసుడనై పరిచర్యలజేయుచున్నను నాకు నిత్యము వారివలన బ్రహరణములు తప్పలేదు. వానిని గణియింపక నేను నాయోపినంత పనిజేయుచుంటిని. నేడు రెండుజాములవరకు నింటిలో బనులుజేసి బ్రాహ్మణార్థమై పిలువబడి