పుట:కాశీమజిలీకథలు -02.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

58

కాశీమజిలీకథలు - రెండవభాగము

నట్లేయుండెను. ఈ రీతి నందున్న మార్గములన్ని యుం దిరిగి చూచితినిగాని దేని సుతయు గనంబడలేదు. అందుజూచిన జాతి మరల జూడలేదు. అవ్వనములో గ్రమ్మరునప్పుడు నాకు పూర్వపు విచారమంతయు జ్ఞాపకము లేదు. దిరిగినకొలది సంతసమేగాని యలసటలేదు. నాకు దిరుగునప్పు డొకచోట నొక వింతయైన ఫలము గనంబడిన దానిం ద్రుంచి భక్షించితిని. అయ్యారే, ఆమాధుర్యమేమని వక్కాణింతును? దానిని దినినది మొదలు నాకు బలముగలిగి క్షుత్పిపాసలు నశించినవి. ఆ మ్రానునం దట్టిఫలము మరియొకటిమాత్రముండుట బరికించి దానిని గోసి మూటగట్టితిని. మరియుం దిరుగ దిరుగ నొకమ్రానున మిక్కిలివింతైన పూవొక్కటియే వికసించి పరిమళము వెదజల్లుచు బ్రకాశించుట బరికించి దానింగూడ గోసి పైటచెరంగున మూటగట్టితిని.

పెక్కేల నక్కాననసౌభాగ్యమంతయు దేటబడ మీకు వక్కాణింప నారుమాసములు పట్టును. వినుమట్లు నేనత్తోటలో దిరుగుచుండ నొక దండ నవరత్నములచే గట్టబడిన దేవాలయ మొకటి గనబడినది. దానిని మొదట దూరము నుండి చూచి కాంతిపుంజ మనుకొంటిని దాపు చేరిన కొలది యాలయమని తెలియవచ్చినది. ఆహా! మనోహరోద్యానవనములో నాదేవాగార మెంతటి శోభగా నున్నదని చెప్పను? కేవలము నాణెమైన రత్నములే బంగారునీటితో అతికి గట్టబడినవి. అందు జనులందరును సంతోషముతో అల్లనజేరినంత నమ్ముఖమంటపమునందు గూర్చుండి వీణ సవరించుచున్న యొక తరుణీలలామంబు నాకు నేత్రపర్వము గావించినది.

కాశీలోనున్న విశాలాక్షి పోలికగా అందొక మహాదేవి యున్నది. పిమ్మట ఆ శక్తిని జూచినంత నాకు మా అన్నపూర్ణ జ్ఞాపకమువచ్చినది పిమ్మట నేనా వీణావతి దాపున అతివినయముతో నిలువఁబడితిని ఆమెయు నన్ను గూర్చుండమని కనుసన్న జేసినది. నేను అతిభక్తిపూర్వకముగా అద్దేవికి మ్రొక్కి అచ్చట నోరగా గూర్చుంటిని. అప్పూవుబోడి పాణియుగంబున వీణధరించి యింపుగా స్వరంబుల వెలయింపుచు అద్దేవిమీద దాను రచించిన కృతుల గాంధర్వాకృతులుగా గలకంఠ నాదము మేళవించి హాయిగా బాడినది. వీణావతి అను పేరుగల అయ్యంబుజాక్షి తుంబురు నొద్ద సంగీత మభ్యసించినదట! విశాలాక్షి అను అద్దేవతను ప్రతిదిన మనుకూలప్రియసమాగమమునకు సేవించుచున్ నట్లచ్చేడియ పాడినకృతిమూలముననే నాకు దెల్లమైనది ఎట్టి కాంతకు అనుగుణప్రియసమాగమం బభిలషించుట సహజగుణముగదా! నేను భూలోకగానవిశేషము లన్నియు వినుటయేగాక సంపూర్ణముగా అభ్యసించి గాయనీ గాయకులలో నుత్తమురాలనని ప్రసిద్ధి నొందితిని. అన్నన్నా! అన్నాళీకవదన చేసిన స్వరకల్పనల కే నెంతేని విస్మయము జెందితిని. చేతనము లచేతనములుగా అచేతనములు చేతనములుగా సంగీతము బాడిరను కవి ప్రౌఢోక్తి