పుట:కాశీమజిలీకథలు -02.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విశాలాక్షి ప్రవాసము కథ

57

గన్నుల దెరచి చూచినంత నేనొక యుద్యానవనంబులో బండుకొనియుంటిని. అప్పుడు లేచి కన్నులు నులిమికొని నలుదెసలు పరికించునంత నా గుర్రము నా తటాకము నావటవృక్షము గనంబడినది కాదు. అప్పుడు భ్రమజెందుచు నోహో! ఇదియేమివిచిత్రము. ఇప్పుడు నేను తటాకము దాపుననున్న మర్రినీడను బవ్వళించితినే. ఇచ్చటి కెప్పుడు వచ్చితిని. నన్నెవ్వరైనం దెచ్చిరా ఏమి. ఇది కడుచిత్రముగా నున్నది. ఇప్పూవుదోట యెక్కడిది? నేను విశాలాక్షి నౌదునా? మరియొకతెనా అగునగు, ఇదికల నిజమనుకొని భ్రమపడుచుంటిని. కాకున్న నే నెరుంగకుండ నిచ్చటి కేలవత్తును. అయ్యో! ఇది కలయని యెట్లు నమ్ముదును. స్వప్నము నిద్రలోవచ్చునుగదా! ఇప్పుడు నా కన్నులు తెరవబడి యున్నవి. ఇదిగో కర్మేంద్రియము లన్నియు బ్రసరింపుచున్నవి. ఇదిరాత్రియా! పగలా! సూర్యచంద్రు లిరువురు గనంబడుట లేదు. వెల్తురుమాత్రము చక్కగానున్నది. నా జన్మావధిలో నిట్టి యద్భుత మెన్నడును జూచియుండలేదే! యని పెద్దతడవు పెక్కుగతుల దలపోసి యది యేదియైనను నిశ్చయింప లేకపోయితిని.

ఏది యెట్లయినను మేలుయగుంగాక యని యప్పూవుదోట సోయగం బరయదరించి మెల్లన నమ్మంటపము దిగి యత్తోటలో బ్రవేశించితిని. అందు మగరాల చేత గట్టంబడి విశాలమగు మార్గముల ప్రక్క మొక్క మొక్కకును నీటితుంపురు లెగర జిత్రవిచిత్రములగు జలయంత్రము లమర్పబడియున్నవి. కుసుమఫలభారమున వంగి నేలంటియున్న లతాకుడుంగములు కన్నులపండువులై పొడగట్టినవి. అందున్న పుష్పజాతులు ఫలజాతులు భూలోకములో నెన్నడును గనివిని ఎరింగినవికావు. వాని పరిమళవిధ మీరీతి దని చెప్పుటకు శక్యము కాదు. విరులయందేగాక ఫలముయందు సైత మద్భుతమైన పరిమళము గలిగియున్నది.

పలుతెఱంగులరంగులుగల విరులచే నొరయు గుత్తుల మొత్తముల నెత్తావుల గుత్తకొని యత్తోటలెల్లడల గ్రుమ్మరు తెమ్మెర లమ్మమ్మా! యొకమాటు మేనికి సోకినంజాలదా! సుమరసంబు గ్రోలి సొమ్మసిలి ఝమ్మని మ్రోయు తుమ్మెదల రొదలు వినిన మునుల హృదయములకు సైతము మదనవికారము బొడమకమానదు. మొదట తీవియల పందిళులు వానిచుట్టు విరిమ్రానులు వానిపైన ఫలజాతులు సూత్ర పట్టి పెక్కుతరములుగా నాటబడియున్నవి. నాటిన రకము వెందెందును మరల నాట బడియుండలేదు. ప్రతిపాదపమునకు యేదో యాధారముగ గలిగియున్నది. అట్టి వినోదకరమగు వనవిశేషములు జూడదలచి యొక మార్గమునంబడి పోవదొడంగితిని. ఎంత దూరము పోయినను తుద మొదలు కనబడలేదు. మరియు వచ్చిన త్రోవయు, బోయిన త్రోవయు సైతము తెలిసినదికాదు.

ఆ మార్గమువిడిచి మరియొకదారిం బడి నడువ దొడంగితిని గాని యదియు