పుట:కాశీమజిలీకథలు -02.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

56

కాశీమజిలీకథలు - రెండవభాగము

14వ మజిలీ

విశాలాక్షీ ప్రవాసము కథ

గోపా! విను మా కాశీరాజపుత్రిక విశాలాక్షి తనవృత్తాంతము వారి కిట్లని చెప్పదొడంగినది తండ్రీ! నీవటు సింహమును బరిమార్పనరిగి యెంతదనుక రాకునికి బరితపించుచు సీ! నా కిక బ్రతికినం బ్రయోజనము గాన్పింపదు. శోకపరంపరలు నన్నూరక బాధింపుచున్నవని నన్నుగాక నాకుపకారము చేయవచ్చిన వారినిగూడ వేధింపుచున్నవి. యాహా! కాలమహిమ యని తలంచుచు మరణకృతనిశ్చయనై యందులకు సాధనమాలోచించుచున్నంతలో నించుక నిద్రపట్టినది.

అప్పుడొక కామినీలలామంబుకలలో నాకు గనబడినది తల్లీ! నీ యుల్లంబున జింతమానుము. నీకు మేలయ్యెడినని దయామేదురములగుచూపులు నాపై వాలపింపజేయుచు నానతిచ్చినది. అంతలో నేను మేల్కొని యాకల్కిని నలుమూలలు వెదకుచు నెందునుగానక కలయని నిశ్చయించుకొని యెహో! నాకు బలుమారిట్టికలలు వచ్చుచున్న వేమి? శుభమో యశుభమో తెలియదు. కానిమ్ము. మరికొంతకాల మరసెదంగాక యని నిశ్చయించి మరణోద్యోగంబు మాని వెండియు దురగమెక్కి యక్కడ గనంబడిన త్రోవంబడి నడువ దొడంగితిని. ఆదారి ఎక్కడికిబోవునో నాకుదెలియదు మిట్టమధ్యాహ్నము దనుక వడిగా నాతత్తడిని నడిపించితిని. యాయరణ్యమున కంతము గనంబడలేదు.

తీవ్రతప్తనగుట మేనం జమ్మటలు గ్రమ్మ క్షుత్పిపాసలతో నలసి యరుగుచున్న నాకు రోగార్తున కమృతంబువోలె మధురజలపూరితంబగు సరోవరం బొండు గన్నులపండువ గావించినది. అప్పుడు సీతకరణచోరకములగు మారుతకిశోరములు మార్గాయాస ముపనయించినవి. వికచసారసవాసనలు నాసాపర్వమొనర్చినవి. జలవిహంగమవిరుతంబులు శ్రవణసుఖంబుజేసినవి. అట్లాసరసి నాకతిథిసత్కారంబుల గావించిన సంతసించుచు నేనందు గఱ్ఱము దిగి మోకాలిబంటినీటిలో నిలువంబడి కరతలంబున నెరయజిమ్ముచు నిర్మలజలంబు గడపునిండ గ్రోలి యందు నిలవంబడి కొంతసేపు తదీయవిలాసంబు లరసితిని. అన్నన్నా! యనుంగువయస్యలు సేవింప బ్రియునితో గూడికొని యిట్టి తటాకంబున గ్రీడించు చేడియదిగదా భాగ్యమని తలపోయుచు దటంబుజేరి యవ్వటవిటపిశీతలచ్చాయ హస్తోపధానముగా శయనించి యాత్మీయగహనసంచారాదిప్రచారంబుల దలంచుకొనుచుండ నంతలో గాఢముగా నిద్రపట్టినది. నేనెంత సేపు నిద్రబోయితినో నాకు దెలియదు. మరికొంతసేపటికి