పుట:కాశీమజిలీకథలు -02.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మదనుని కథ

55

చేసిన యుపకార మెన్నటికిని మరువవలసినది కాదు. యమలోకమునుండి వెనుకకు లాగికొని వచ్చితివి. నా యావజ్జీవము నీయందు గృతజ్ఞుండనై యుండెద. మాకు బోవ అనుజ్ఞయిమ్ము. నాకిక విశాలాక్షిని వెదకి యీ మదనునితో గూర్పవలసినపని యొకటి మిగిలియున్నది. అమ్మహాసాధ్వి యెందున్నదో తెలియదు. ఆకొరంత దీరెనేని నేను గృతకృత్యుండ నగదునని పలికిన విని యజ్జనపతి నవ్వుచు నిట్లనియె.

నరేంద్రా! ఈ మదనుండు శాపగ్రస్తుండై యున్నతరి అత్తలోదరిని బెండ్లియాడెను. అప్పడంతియు నితని విడిచి చాల కాలమైనది. మీరిప్పు డాపూవుబోడి వెదకి తీసికొనివచ్చినను నీతం డానాతి బరిగ్రహించునా! ఆ మాట దెలిసికొని మరియుం బొండని నుడువుటయు నయ్యొడయుం డమ్మదనుని మొగముజూచెను. ఆతండప్పుడు భూపా! నేను శాపగ్రస్తుండనైయున్నను అమ్మహాసాధ్వి మనోవృత్తి నెరుంగుదును. మేరువైనం జలించునుగాని యమ్మదవతి హృదయము చలింపదు అక్కాంచనగాత్రిని గాంచుటకంటె భాగ్యమున్నదియా! ఎట్లయిన నా ప్రేయసిని గూర్పుడు మీ కనేక వందనముల గావించెదనని పలికెను. ఇంద్రద్యుమ్నుండును విశాలాక్షి గుణంబులట్టివేయని స్తోత్రము జేసెను.

అప్పుడా సింహకేతుడు నవ్వుచు నా చిన్నది యీ యింటిలోనే యున్నది. మీకు జూడ వేడుక యేని నిందు రప్పించెద నుండుడని తటాలున లేచి లోపలికిం బొయెను. ఒక ముహూర్తములో నా లోపలి నుండి యొక చిన్నది వారికి నమస్కరించిన మదనుండు గురుతుబట్టి హా! ప్రేయసి! హా! విశాలాక్షీ! యని పలుకుచు నాయెలనాగం గౌగలించుకొనియెను. ఇంద్రద్యుమ్నుండును అమ్మా! నీవు మావిశాలక్షివే! ఇచ్చటి కెట్లు వచ్చితివి! ఎందెందు తిరిగితివి. ఈ నృపతి యాశ్రయం బెట్లబ్బెను నీవృత్తాంతము జెప్పుమని యడిగిన నప్పడతి నవ్వుచు నార్యా నాకథ మిక్కిలి యద్భుతమైనది. సావధానముగా జెప్పవలయు నిప్పుడు ప్రొద్దుబోయినది. భోజనాదిక్రియలు నిర్వర్తింపవలయునని పలికి వారిని లోపలికిం దీసికొనిపోయి తగు నుపచారముల జేయించినది. అని యెరింగించి మణిసిద్ధుండు వేళ యతిక్రమించుటయు నప్పటికి కథ జెప్పుటమాని తదనంతరోదంతం బవ్వలిమజిలీయం దిట్లని చెప్పదొడంగెను.