పుట:కాశీమజిలీకథలు -02.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

54

కాశీమజిలీకథలు - రెండవభాగము

ద్యుమ్ను డనువాడను. దైవవశమున వీరికి జిక్కి బలిపురుషుడ నైతినని తాను వేటకు బయలుదేరినది మొదలు నాటి దనుక జరిగిన వృత్తాంత మామూలచూడముగా వక్కాణించెను.

ఆ వృత్తాంతమంతయును విని యా భూకాంతుడు సంతోషభయసంభ్రమశోకంబులు చిత్తంబులబెట్ట నురముపై గరం బిడుకొని కటకటా! ఈ గ్రామవాసు లెంత క్రూరులు! వీరినందర నేకముగా జంపించినను దోషము లేదుగదా! మార్గస్థుల నందర నీరీతిని వేధించుచున్నారు గాబోలు. తెలిసికొనలేకబోయితినే. కానిమ్ము దైవకృపచే నిప్పటికైనం బట్టుకొంటినని సంతసించుచు కృష్ణదాసుని జూచి యోరీ ! తులువా ! ఇక నీవేమి చెప్పెదవురా? నిన్ను గత్తులబోనులో ద్రోయింతును చూడుమని పండ్లు పటపట గొరుకుచు నా క్షణమె గ్రామములో నన్నియిండ్లును బరీక్షించి యచ్చట నున్నవారినందర దనయొద్దకు దీసికొనిరండని యమకింకరులంబోలు కింకరుల కానతిచ్చి యింద్రద్యుమ్నుని వెంటబెట్టుకొని తనకోటలోనికి బోయెను. రాజభటులు తదానతి బటురయంబున బోయి ప్రతిమందిరమును వెదకి యందున్న బలిపురుషుల గనుగొనుచు వారికి వైచిన సంకెళులు విప్పి యా యింటి యజమానుని బంధించుచు గ్రమంబున నీరీతి అందరం బట్టుకొని సాయంకాలమునకు రాజుగారి యాస్థానమునకు దీసికొనివచ్చిరి.

ఆ భూపతి వారి వారివృత్తాంతములన్నియు విని పౌరులు గావించిన క్రూరాచారములకు మిక్కిలి సంతసించుచు నయ్యపరాధులకెల్ల దగినశిక్ష విధించి బలిపురుషులనెల్ల నాదరింపుచు గానుకలతో గూడ వారి వారి దేశముల కనిపెను. వారిలో నున్న యింద్రద్యుమ్నుని భార్య చిత్రసేనను మదనుని బ్రత్యేకముగ గౌరవించి యంతఃపురమునకు దీసికొనిపోయెను. ఇంద్రద్యుమ్నుడందు దన భార్య జిత్రసేనను గురుతుపట్టి తన్నామెకుం దెలియజేసి యా సతీమణి పడిన యిడుమ లన్నియు విని మిక్కిలి పరితపించెను.

క్షత్రియదంపతులును మదనుండును సింహకేతుడు తమకు గావించు అపూర్వసత్కారములకు మిక్కిలి విస్మయము జెందుచు పలువిధంబుల గొనియాడ దొడంగిరి. పిమ్మట సింహకేతుండు వారి మువ్వుర నొక రహస్మస్థలమునకు దీసికొని పోయి యుచితాసనంబులం గూర్చుండబెట్టి యిట్లు సంభాషించెను. ఇంద్రద్యుమ్నమహారాజా! నీవును నీ భార్యయు నీ మదనుడును కాశీరాజు కూతురు విశాలాక్షికతంబున గదా యిట్టి యిక్కట్టులంబడితిరి? నీవు గడు బుణ్యాత్ముడవు. నీ పరోపకారపారీణత దీనం దేటబడుచున్నది మరియు నీ పుస్తకము మొదట విశాలాక్షి యాపద దాటించినది. ఇప్పుడు మీ యిక్కట్టును నిదియే పోగొట్టినది. దీనిని జూచియే గదా నేనా యిల్లు పరీక్షించితిని. ఈ పుస్తకము వ్రాసినవారు కడుపుణ్యాత్ము లగుదురని పల్కుటయు నింద్రద్యుమ్నుం డానృపతి కిట్లనియె. అనఘా! నీవు మాకు