పుట:కాశీమజిలీకథలు -02.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మదనుని కథ

47

ఈ శ్లోకములు నేను జెప్పినవికావుగదా? లోకస్వభావమును మానిపింప నెవ్వనిశక్యము. రక్షింపుడని పెక్కుతెరంగుల బ్రార్ధించినది.

నేయిబోసిన యగ్నివలె దానిమాటలచే నతండు మఱియు మండిపడుచు సురుచిని విరూపగా శపించి నన్ను జురచురంజూచి యోరీమూర్ఖా! నీవు విద్యలచే నాకు సమానుండవయ్యుమ వివేకమింతైనం దలంపక నిట్టి ఘోరకృత్యమునకు బూనుకొంటివి. కానిమ్ము నీవు విద్యలన్నియు మరపుజెంద బూర్వపుస్మృతి యించుకయు లేక వెర్రివాడవయి చరింపు మీపాటి ప్రాయశ్చిత్తము నీకు జాలునని నన్ను శపించి యరుగనున్న సమయంబున నేనును బాదంబులంబడి యార్యా! కడుశ్రమపడి చదివితిని. ప్రమాదవశంబున భ్రష్టుండనైతిని. నాగుణము మీరెఱుంగనిదియా? నన్ను గటాక్షించి శాపాంతము గూడ ననుగ్రహింపుడని వేడుకొనగా గరుణాహృదయుండగు నాభూసురుం డోరీ! నీవు మరణప్రాయమైన యిడుములం గుడిచినప్పుడు నీకు మరల నీవిద్యలన్నియు జ్ఞాపకము వచ్చును. నీ పూర్వపుణ్యము మంచిది పో పొమ్ము. బ్రతికి పోతివని పలికి అతండెందేని పోయెను. అప్పుడు నేను పశ్చాత్తాపతప్తచిత్తుండనై అదియు నొక ప్రారబ్ధముగా దలంచి విచారింపక ధైర్యముతో నన్నా శాపవైకల్య మాశ్రయించులోపున గాశికి బ్రయాణమై కతిపయదినములకు గాశింజేరితిని.

అందు ప్రవేశించిన కొన్ని దినములకు విశాలాక్షిం బెండ్లియాడితిని. ఆ తర్వాత వృత్తాంతము మీ రెఱింగినదేకదా? అట్టి విశాలాక్షి నీపాటి తెలివితో వీక్షించు భాగ్యము లేకపోయినది. అన్నన్నా ఇప్పుడు నన్ను జూచి యెంతసంతసించునో? ఆ చిన్నదాని చర్యలం దలంచుకొన గన్నులనుండి అశ్రువులు ప్రవాహముగా వెడలుచున్నవి. నేను తిన్నగా మాటాడునంత గోటిదీనారములు దొరికినట్లు సంతసించునది. నానిమిత్తము ప్రాణములు పోగొట్టుకొనదలంచిన యా మహాపతివ్రత యెట్లున్నదియో గదా? నేను వెర్రివాడనని యించుకయు నామాట నిరసించునదిగాదు. రాజా యేమి చెప్పుదును. అట్టి కాంత నిక యీజన్మమునం జూడనని తోచుచున్నది. గుర్రమునుండి నేలబడినంత నాకు శాపాంతమైనది. అప్పుడే సింహమును జంపితిని. నాపరాక్రమము సంగతి మొదట నీతో జెప్పుట మఱచితిని. నేను బాల్యమునుండియు శస్త్రవిద్యయందును బరిశ్రమ చేయుచుంటిని. దానంబట్టియే యక్కేసరి నవలీలం బరిమార్చితిని. పిమ్మట నా విశాలాక్షిని వెదకుచు బెక్కుదేశములకుబోయి తుద కీయూరు చేరితిని. ఈగ్రామమున నిట్టిఘోరకృత్యములు జరుగుచున్నవని తెలిసికొనలేకపోయితిని.

సాయంకాలమున కిందుజేరిన నొకయిల్లాలు దారికడ్డము వచ్చి మర్యాదగా దనయింటికి భోజనమునకు దీసికొనిపోయినది. ఆ రాత్రి వారియింట నాకు జేసిన విందు అల్లునకైనం జేయరని చెప్పగలను. దాచనేల నాయింటిలో నొకసుందరి నేను శయ్యాగతుండనై యున్న సమయంబున జక్కగా నలంకరించుకొని నాయొద్దకు వచ్చి