పుట:కాశీమజిలీకథలు -02.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

44

కాశీమజిలీకథలు - రెండవభాగము

జెప్పెదను తప్పంతయు దనయొద్ద బెట్టుకొని యెదిరిననుట లోకస్వభావమేకదా? నేను పుణ్యమునకు వంటకములు వండిపెట్టి యెట్లున్నవని యడిగిన సురుచిగానే యున్నవికాని మర్మము మాత్రము తెలియలేదని పలికిన మాట మరచిపోయితివేమో! సురుచియని నామాట ముందుగా నేమిటికి దలపెట్టవలయును. ఈతప్పెవ్వరిదో చిన్న దానినిజేసి యొంటిపాటు చూచి యాడించుచుంటివిలే! యని పరిహాసమాడెను.

అప్పుడు నామనంబున నొకమూల బాపభీతియు నొకమూల దాపభీతియు వేధింపదొడంగినది దాని క్రియలకు బ్రతి క్రియజేయ నుద్యుక్తుండనగుటకు దెగింప బోవుచు నంతలో నయ్యో! ఇంత చదువు చదివియు బావిలేని పూవుబోణి నెట్లుగూడుదును లోకులు వినిన నిందితురేయని మరఁగొంకుచు నీరితి గొంతసేపా పైదలిసేయు కృత్యముల సైతము గుర్తెరుంగక చింతింపుచుంటిని. తరువాత చెప్పునదేమి గలదు.

శ్లో॥ సంసారేపటలాంత తోయచపలే సారంయదేకః పరం
     తస్యాయంచపునస్సమస్తవిషయగ్రామః ప్రపంచోమతః
     యత్సౌఖ్యం పరతత్వవేదన మహానందోపమం మందధీః
     కోవావిందతి సూక్ష్మమన్మథకళావైచిత్ర్యమూఢోజనః॥

ఇంటిమీదబడు జలమువలెనే చంచలమగు సంసారంబున నింద్రియములే ప్రపంచకమననొప్పు. కామసౌఖ్యము మిగుల సారవంతమైనదియు బ్రహ్మానందతుల్యమైనదియు నట్టిదానిని మన్మథరహస్యవేత్త కానివా డేమి తెలిసికొనగలడని పూర్వ మొకపండితుడు వ్రాసెను. వానిమాట యదార్థమయినది. అంత నుదయంబున మేము లేచునప్పటికి మించిపోయినటుల మా గురువుగారింటికి వచ్చిరి. ఆయన నను జూచినతోడనే నాహృదయము ఝల్లుమనినది. ఆయనయు నన్ను జూచి రాత్రి యింటియొద్ద నెవ్వరుండిరి. బదిలముగా బండుకొనిరా. నీకన్నులంత యెఱ్ఱగా నున్నవేమి రాత్రి యెక్కువ సేపు మేల్కొనియుంటివా యేమి? యని యడిగిన నేనును నించుక గొంకుచు నిట్లంటిని. అయ్యా! మీరు గ్రామాంతర మరుగుటచే విద్యార్థులందరు తలయొకపనికిం బోయిరి. మీరాక విని నేడే రాగలరు. ఇంటియొద్ద భద్రముగానే పండుకొంటిమి. రాత్రి పాఠచింతన తడవుదనుక జేయుచుంటిని. ఇదియునుంకాక మీరు లేకపోవుటచే మీ భారమంతయు నామీద బడుటచే నిల్లుగాయుటకై మేలుకొంటిని. దానం జేసి నాకన్ను లెర్రగా నున్నవని పలికితిని. నాయందు మిగులనమ్మకము గలదు కావున నాయన మాయొంటిపాటును గురించి యంత విచారింపడయ్యెను. మనము తఱిదొరకినప్పుడుగాక మఱి ఎప్పుడును నవ్వుచు మాట్లాడగూడదు, చూడగూడదు, చేరగూడదు. గూఢముగా నుండవలయునని నేను మొదటనే యమ్మదవతితో జెప్పియుంటిని గాని యామాట లేమియు నిలిచినవికావు.

అమ్ముద్దియ ఎద్దియో యొకమిషమీద నాయొద్దకు వచ్చుచు నన్ను బల్క