పుట:కాశీమజిలీకథలు -02.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మదనుని కథ

43

వంతుడను కాను. నీవు దీనిమీద బవ్వళింపుము. నేను వేరొకచోట శయనించెదనని చెప్పితిని. అంత నక్కాంత శిరఃకంపము సేయుచు వద్దు వద్దు. నీ వామంచముమీదనే పరుండుము. కొంచెము శుభ్రమైనమంచమొకటి యున్నది. దానిని దెచ్చుకొని యిందు వైచి పరుండెదనులే యని చెప్పి యాప్రకారము చేసినది. అంతలో మరల లేచి మదనా! యిదుగో యిందాక నీకు దాంబూల మియ్యవలయునని యిచ్చట బెట్టి మరచిపోయితిని, వైచుకొనుమని నా మంచముదాపునకు వచ్చినది.

నాకు దాంబూలము వైచుకొను నలవాటులేదు. ఇదియునుంగాక నేను బ్రహ్మచారిని. బ్రహ్మచర్యవ్రతమం దున్నవారు తాంబూలము వైచుకొనగూడదు. నీవే వైచుకొనుము. పొమ్ము పరుండుమని కొంచెము ధైర్యము దెచ్చుకొని చురుకుగా బలికితిని. అప్పు డామె నవ్వుచు నోహో! చాలు చాలు, ఏమి నీబ్రహ్మచర్యవ్రతము పాపము తాంబూల మొక్కటిమాని తక్కినపను లన్నియుం జేయవచ్చును గాబోలు, నాముందరనా నీడాంబికములు బ్రహ్మచారిగారూ! మంచముమీద బరుండవచ్చునా? ధోవతులు గట్టవచ్చునా? గంధమలందు కొనవచ్చునా? ఏది! గ్రంథములో నెట్లున్నదియో చూతము. దోషమని యుండినచో నుదయమున బ్రాయశ్చిత్తము చేయించుకొని యెదవుగానిలే? యని బలుకుచు నాకు మడుపులం జేతబట్టుకొని నానోటం బెట్టబోయిన నేనును దొందరపడి దాని చేయింబట్టుకొని సురుచీ! నిలునిలు, నీకు గొంత జెప్పవలసి యున్నది. నామాట వినిన పిమ్మట నిత్తువుగాని యని యెంత జెప్పినను వినక నా యెదుట బెక్కు కామవికారములం బ్రకటించినది.

అప్పుడు నే నహంకారముతో అన్నా! సురుచీ! ఇది యేమిపని? నీ వెంతో గుణవంతురాలవను కొంటినే, నేటితో దేటయైనది. నీవంటివారలు నీతిమాలిన పనులు చేయుదురా? విశ్వనాథబట్టుగారు వచ్చినచో దండింపరా? యుదయము నుండియు నేను గనిపెట్టుచునే యున్నాను. నీచర్యలన్నియు విపరీతముగా నున్నవి. వెళ్ళుము నీమంచముమీద బరుండుమని యెన్నియో నీతివాక్యములు చెప్పదలంచుకొన్న నాకాపాటి మాటలు నోటినుండి వచ్చువరకు గృత్యాద్యవస్థయైనది. అప్పటి నాచిత్తవృత్తి యెట్లున్నదియో యదార్థముగా నీకుజెప్పెద వినుము. ఉదయముకన్న మధ్యాహ్నము, మధ్యాహ్నము కంటే సాయంతనము, సాయంతనముకన్న రాత్రియు, రాత్రికన్న నప్పుడు క్రమంబున నామనము చాంచల్యమందినది.

శ్లో॥ బలవానింద్రియగ్రామో విద్వాంసమపికర్షతి॥

ఇంద్రియములు చంచలమైనవి విద్వాంసుని సైతము మోసము జేయునను నార్యోక్తి నాకు బాగుగ నచ్చినది. అట్టి మాటలువిని యాచిన్నది కన్నులెర్రజేయుచు నోహోహో! బుద్ధిమంతుడా! శ్లేషలు నీకేకాని యెవ్వరికి దెలియవనుకొంటివి గాబోలు నాదుర్గుణం బేమి కనిపెట్టి యిట్లంటివి. యింకొకసారి యనుము. తర్వాత