పుట:కాశీమజిలీకథలు -02.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

42

కాశీమజిలీకథలు - రెండవభాగము

జతురతగా బల్కదొడంగినది. తలద్రిప్పుటయే కాని నే నొక్కదానికి నుత్తరము జెప్ప లేదు.

భోజనముజేసి నేను వాకిటకు బోవ యత్నము చేయుచుండగా సురుచి నాతో మదనా! నే నొంటిగా నుండలేను, నేను గుడుచునప్పుడు దాపున గూరుచుండవలయును. నేడు విద్యామందిరమునకు బోవుట మానివేయుము. నాకు భయము చాల గలదు. నీవిందు గూర్చుండనిచో నేను కుడువనని చెప్పగా నేనేమి చేయవలెనో నీవే చెప్పుము. దానికేమియు నుత్తరము చెప్పలేక యూరకున్నంత దాపున నొక పీటవైచి యందు గూరుచుండుమని చెప్పినది. నే నందు గూరుచున్నంత దన తళుకుచూపులు నడుమనడుమ నాపై బరగించుచు నెద్దియో పలికి నవ్వుచు దృటిలో భోజనముచేసి లేచినది. పిమ్మట నన్ను జూచి మదనా! నీవెచ్చట బరుండెదవో చెప్పుము మంచము వాల్చెద నని యడిగిన మేను గజగజవణంక కంఠము డగ్గుత్తికపడి స్వరమురాక హీనస్వరముతో నీ నీ యిష్టమని పలికితిని. అప్పుడా సురుచి యట్లయిన నా గదిలో బరుండెదవా? యని యడిగినది. ఆ ద్వంద్వార్థము గ్రహంచి నేను శిరఃకంపము సేయుచు నేమియు ననలేక యూరకున్నంత నక్కాంతయు నంతకుబూర్వమె యలంకరించి యున్న తనగదిలోనికి దీసికొనిపోయినది.

నే నాగది నంతకు మున్నెన్నడు జూచి యుండలేదు. కడువింతగనున్నది. అట్లుపోయి యందున్న పట్టుపందిరిమంచముమీద గూరుచుంటిని. అప్పటి నా యభిప్రాయమెద్దియో మీరు గ్రహించితిరా? అయ్యోష తన యభిలాష బూర్ణముగా వెల్లడించినప్పుడు నీతి జెప్పెద మని యంతదనుక నామె చెప్పినటుల చేయుచుంటిని కాని మరియొక కారణముగాదుసుడీ! అంత నక్కాంతయు వేరొకగదిలోనికి పోయి నిమిషములో జగన్మోహనంబైన యలంకారముబూనివచ్చింది. రాజేంద్రా! నీకు దాచనేల? అప్పుడు దానిని జూచిన నంతకు బూర్వముగల నా మనస్థయిర్యము కొంచెము సాంకర్యము నొందినది. దానిని దృఢపరచుకొనుచున్న నాచెంతకువచ్చి యచ్చేడియ మదనా! నేనెందు బరుండనో చెప్పుమని యడిగినది. నీయిష్టము వచ్చినచోట బరుండమని యుత్తరము చెప్పితిని. నాచేత ననిపించుకొన వలయునని యామెకును, ఆమె తనకోరిక వెల్లడించిన పిదప నీతిజెప్పుదమని నాకును మనంబున గలిగియున్నది.

నా మాటవిని యబ్బోటి మదనా! చాలుచాలు. నీ వెప్పుడును పుల్ల విరచినట్లే మాటలాడెదవు. అన్నింటికిని నీయిష్టమే యందువుగాని యొకదానికి దగునుత్తర మియ్యవు. అన్నియు నా యిష్టమైనచో నిక నీయిష్టమేది. నామంచము మీద నీవు పరుండితివి. నాకు వేరొక శుభ్రమైన మంచములేదు. దానికై యాలోచించుచు నిన్నడిగితిగాని నా యిష్టమైనచో నిన్నడుగనేల? పోనీ నేలనే పరుండెదనులే యని పలుకుచు జాప సవరింపబోయినది. అప్పుడు నేను మంచము డిగ్గనురికి అయ్యో! నీవు క్రింద బరుండగా నేను మంచముమీద బండుకొందునా? నీకన్న నేనెక్కుడు సుకుమార