పుట:కాశీమజిలీకథలు -02.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మదనుని కథ

41

లన్నియుం బరిశీలింప నా మదవతి హృదయము చాంచల్యమందినదనుట కేమియు సందియము లేదు. ఇటుమీద నేనేమి చేయదగినది. ఈ రాత్రి భోజనమునకు బోయినప్పుడు మిగిలిన సందియముగూడ దీర్చును. అనర్థమురాకమున్నే ప్రతీకార మూహింపవలసియున్నది. ఇప్పు డామెకు జెప్పకుండ నేనెక్కడి కేనింబోయి గురువు వచ్చినవెనుక వచ్చెదమనుకొనిన నీచిన్నది యొంటరిగా నుండుట జూచి యిల్లు మ్రుచ్చులు కొల్లబెట్టినచో నేమిచేయనగు? ఇదియునుంగాక మాటలచాతుర్యమువలన నూహించుటయేకాని తన యభిప్రాయము నాకు వెల్లడించినదా? అంతమాత్రమునకే నేను లేచిపోయినచో మా గురువు నన్ను మందలింపకమానడు. ఇప్పటికైన నత్తరుణి చిత్తవృత్తి యిట్టిదని నిరూపింప శక్యమగునా? కావున నాకేమిచేయుటకు దోచుట లేదు. కానిమ్మంతపని వచ్చినప్పు డక్కంతామణి స్వాంతము నీతిబోధచేసి మరలించెదనని నిశ్చయించుకొని భగవంతుని వేడుకొనుచుంటిని

ఇంచుక చీకటిపడినదో లేదో యంతలోనే నన్ను భోజనమునకు రమ్మని కేకవై చినది. మేను కంపమునొంద మెల్లనలేచి భోజనమునకు బోయితిని. నాకు గాళ్ళు గడిగికొనుటకు సుష్ణోదకము దెచ్చి యిచ్చినది. నేనును బాదప్రక్షాళనముచేసి తడిబట్ట గట్టికొని లోనికి పోవునంత మంచివిలువగల మాగురువుగారి పట్టుపుట్టము నెదురుగా దెచ్చి యీయబోయిన నేనిట్లంటి అయ్యో! ఇది మా గురువుగారిది నేను గట్టుకొనగూడదు. వేరొకటి తెమ్మని యడిగిన నచ్చేడియ నవ్వుచు గురువుబట్ట గట్టుకొనగూడదని యే గ్రంథములో వ్రాసియున్నదో చూపింపుము. వేరొకబట్ట యారవేయలేదు. ఇది ధరింపక తప్పదని బలాత్కారముగా నాచేతం బెట్టినది. దానిని గట్టుకొని పీటమీద గూర్చుండునంత మూడుభాగములు మిగిల్చి కోసిన యరటియాకు వైచి యందు సన్నని యన్నము కూరలు పచ్చడులు భక్ష్యములు వింతవింతలు వడ్డించినది.

రాజేంద్రా! నే నేమని చెప్పుదును. ఆదినమున నాకు జేయునుపచారము లన్నియు గ్రొత్తవియె కాని యెన్నడును జేసినవిగావు. అదేమిపాపమో, యెప్పుడో తన యభిప్రాయము స్పష్టంగా వెల్లడించిన తరువాత నీతి చెప్పెదనని తలంచితినిగాని మొదటనే యివి యేమి చర్యలు విపరీతముగా నున్నవి. తగ వని చెప్పుటకు నోరు వచ్చినది కాదు. ఆమె యేమిచెప్పిన నొప్పుకొనువానివలె నూరకుండి చేయుటచే గ్రమ క్రమముగా నాయువతి మితిమీర దొడంగినది. నాకు మాట్లాడబోయినంత కంపము వచ్చుచుండును. ఏమి చేయుదును. మనంబున నెన్నయో యూహలున్నవి. యొక్కటియు నోటినుండి వెలువడలేదు. నేను దలవాల్చుకొని భుజింపుచుండ చెంతగూరుచుండి రుచులు చక్కగా నున్నవియా, నీకిష్టమైనవేనా యని యడుగుచు పలువిధముల