పుట:కాశీమజిలీకథలు -02.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

36

కాశీమజిలీకథలు - రెండవభాగము

రాకుండ సత్రమొకటి యుంచెను. మరియు పుస్తకములుగాని బలినిచ్చువారిగాని దాచెద మేమోయని వత్సరమున కొకటి రెండుసారులు మన గృహములు పరీక్షించుచుండెను గదా? ఇక మన కృత్యములెట్లు సాగును? దీనంబడసిన యీ యైశ్వర్యము లెట్లు నిలుచును? నవరాత్రదినములు సమీపించుచున్నవి. యీపాటికి మన యిళ్ళన్ని యు బలిపురుషులతోడను స్త్రీలతోను నిండియుండినవి. ఇప్పు డెచ్చట నున్నట్లు తెలియదు. అమ్మకమునకు దెచ్చువారు కూడ రాజభీతిచే పూర్వమువలె నరుదెంచుటలేదు. ఈ సంవత్సర ముత్సవము లెట్లు జరుగునో తెలియకున్నది. ఐనను నేటికి సిద్ధముజేయ బడిన బలిపురుషుల సంఖ్య యెంతయో చెప్పుడని యడిగెను. అప్పుడు సభాపతు లందరు తమ తమ యిండ్లలో నున్న పురుషులను స్త్రీలను లెక్కింప నూటపదమువ్వు రైరి. వారిలో స్త్రీలు పదమువ్వురు. తక్కిన నూర్గురు పురుషులు. విత్తమిచ్చి కొనిన వారు ముప్పదిమంది తక్కినవారందరు నింద్రద్యుమ్నునివలె లభ్యమైనవారే యని యాసంఖ్యను సభాపతులు వేరువేర నిరూపించి చెప్పిరి.

పిమ్మట సభాధ్యక్షుడు మరల వారికిట్లనియె. ఈనూట పదమువ్వుర నింతవరకు గాపాడితిరి. ఇంక దాచుట కష్టము. నిన్నటిదినమున చాటింపు సంగతివింటిరా? మన గృహములన్నియు బరీక్షింతురట. దీని కేమి చేయవలయునో యాలోచింపుడనుటయు నందొక వృద్ధసభాపతి యిట్లనియె. అయ్యా! నాకు దోచిన సంగతి నేను జెప్పెదను వినుండు. ఒక్కడేని మనయింట దొరికినచో మనలను శిక్షింపకమానరు. కావున నీలోపుననే మనము వీరినందరిని వేరొకచోటున దాచవలసియున్నది. అట్టిజో టెద్దియంటేని యీ చండివర్మ రాజ్యమునకు వచ్చిననాటంగోలె లేదు గాని మన పూర్వులు గూడ నీ దినములలో రాజభీతిచే బలిపురుషుల బ్రచ్చన్నముగా దాచువారు. దానికై యీ పట్టణమునకు బ్రాంతమందుగల యడవిలో నొక పాతాళగృహము గట్టించిరి. అందు రెండు గదులున్నవి. ఒకటి పురుషులకు, రెండవది స్త్రీలకునుగా నేర్పరచిరి. ఒక్కొక్కదానిలో వేయిమంది పట్టుదురు. దానిలో భోజనాదిక్రియలు జరుగటకు దగిన యరలున్నవి. కావున వీరినందరిని రహస్యముగా నందుజేర్చి బరీక్షదినములు దాటినతోడనే మరల మన యిండ్లకు దీసికొని రావచ్చును. అట్లు చేసిన యుక్తముగా నుండునని చెప్పెను.

వృద్ధసభాపతి చెప్పిన యాలోచన యుక్తముగా నున్నదని యందరు నొప్పుకొనిరి. పిమ్మట మరల సభాధ్యక్షుడు వారితో నిట్లనియె. ఈతడు చెప్పిన పద్ధతి సమంజసముగా నున్నదని యందరు సమ్మతించిరి. నాకును సమ్మతమేకాని మరి యొకటి విచారింపుడు. మనము నూర్వరనేకముగా నొకతావున నుంచినచో వారందరు నేకమైన మన యాజ్ఞలో నుందురా ? ఎదిరించి పరిచారకులను దండింతురు. ఇదియునుం గాక నిందరనేకముగా నచ్చటికి దీసికొనిపోవుచుండ నా యలజడి రాజభటులకు దెలియక మానదు. దెలిసిన పిమ్మట శిక్షింపక మానరు. కావున దీనికేమి చెప్పెదరని యడిగెను.