పుట:కాశీమజిలీకథలు -02.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మళయాళ దేశము కథ

35

యొక యింటిలోనికి బోయినది. దానికృత్యములన్నియుం దలపోయుచు నది కైతవమా? యదార్ధమా యని వితర్కింపుచు నిశ్చయింపలేక మనంబుయ్యెల లూగుచుండ నతండెట్టకే నిదురించెను. అతండుదయమున లేచి చూచువరకు బాదములకు జేతులకు సంకెళ్ళు తగిలి యున్నవి. ఇనుపనాళములచేత గట్టంబడి బోనురీతినున్న యొకగదిలో నుండెను. ఆ గదికి నవ్వలవైపునం దాళమువైచి యున్నది. అట్టి విధమంతయుం జూచి అయ్యో! నేనేమి నేరము చేసితిని? నన్ను కారాగృహములో నుంచుటకు గతంబెద్ది? అమ్ముద్దియకోరినరీతి నడువకునికి కాబోలు. మేలు మేలు. పాపమా బాటసారి యీ యూరిలో నాడువారు మోసపుత్తురని మొదటనే చెప్పియున్నవాడు అమ్మాటల నమ్మక యీకొమ్మ చేజిక్కితి నిక నేమి సేయగలను? ఎంత బలము గలిగి యున్నను బోనునంబడిన సింహమేమి చేయగలదు? కటకటా! నవరాత్రదినములు సమీపమునందే యున్నవి. ఇప్పుడు నన్ను శక్తికి బలి యిత్తురు కాబోలు. కానిమ్ము దానికి నేను వగవను. ఎప్పటికైనను మరణమున్నదియేకదా? శపధము దీర్చుకొనలేక పోతినను చింతమాత్రమున్నది నాకు దైవ మీరీతి మృతి వ్రాసియుండగా మరియొకరీతి నెట్లు జరుగును?

శ్లో॥ అభావీనభవత్యర్థో నాభావో భావినః క్వచిత్ ॥
      ఏతద్వదంతో విద్వాంసః క్లిశ్యంతె దేవమోహితాః॥

అనగా కానిప్రయోజన మెన్ని విధముల బ్రయత్నము చేసినను కానేరదు. ఏమియు బ్రయత్నము చేయకనే కానున్నది కాకమానదు. అని చెప్పుచు విద్వాంసులు సైతము దేవమోహితులై భ్రాంతి నొందుచున్నారు. కావున నే నిప్పుడు చింతించనేల కర్మసూత్రమెట్లున్నదియో యట్లు జరుగక మానదు.

శ్లో॥ వికటోర్వ్యామప్యటనం శైలారోహణ మపాంనిధేస్స్తరణం
      నిగళంగుహాప్రవేశోవిధిపరిపాకః కథంనుసంతార్యః॥

విదేశసంచారము పర్వతారోహణము సముద్రముమీద బోవుట కారాగృహప్రాప్తి, గుహలో ప్రవేశించుట లోనగునవి దైవవశమున సంప్రాప్తించునందురు. వాని దాట నెవ్వనికి శక్యము కాదు. అని బెక్కుతెరగుల విచారించుచు నింద్రద్యుమ్నుం డా బందీగృహంబున గొన్ని దినంబులుండెను. పుణ్యపురుషులలో నగ్రగణ్యుండగు నమ్మహారాజు ప్రాకృతజనుండువోలె నొకయింట బంధముపడి యుండెను. అన్నన్నా? పుడమిలో నిడుముల గడవనివారు లేరుగదా? ఇట్లుండునంత నాయూరి సభాపతులు కొందరొకనాడు రహస్యముగా నొకసభజేసి యీరీతి సంభాషించుకొనిరి. సభాధ్యక్షుడు సభాపతులతో మనకు ప్రభువగు సింహకేతుడు పూర్వపురాజు దండవర్మవలెగాక మనమంత్రశాస్త్రపుస్తకములన్నియు ముట్టడించి లాగుకొనియెను. నవరాత్రములలో మనము చేయుశక్తిబలులు సాగనిచ్చుటలేదు. విదేశస్థులు మనయిళ్ళకు