పుట:కాశీమజిలీకథలు -02.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

34

కాశీమజిలీకథలు - రెండవభాగము

కాలేదు. యెట్లో ఆకలి దీర్చుకొనుడు అని పలుకుచు సురటి గైకొని వీచుచు నడుమ నడుమ నేయి తానే వడ్డించుచు నీరీతి అతనిని లేచుదాక బలవంతబెట్టుచుండెను.

ఆబ్బోటిమాటలకు మోమాటము జెందుచు అతండు భుజించెను. తర్వాత ఆతనిని పరిచారికలు శయనగృహమునకు దీసికొనిపోయి యందు హంసతూలికాతల్పంబునం గూర్చుండబెట్టిరి. ఇంతలో అక్కాంతయు గప్పురపువీడెము చేతంబుచ్చుకొని యాగదిలోనికి బోయి అతనికందిచ్చుచు దానసంతుష్టి వడసిన పిమ్మట వీణంబుచ్చుకొని హాయిగా దంత్రీనాదముతో కంఠనాదము మేళగించి పాడదొడంగినది. సంగీతప్రియుండగు నారా జాపాటలగంధి పాటకు మనంబు గరుగ అచ్చెరువందుచు అప్పుడు దానిని దివ్యాంగనగా దలంచెను. అచ్చేడియ పాడుచుండగనే అందున్న పరిచారకులు క్రమక్రమముగా అవ్వలకు బోయిరి.

ఒంటరిగా నుండి పాడుచున్న యాచిన్నదానింజూచి యాఱేడు వేరొకలాగున సందియమందు చుండెను. అంత పాటచాలించి యా యించుబోడి మెల్లగ అతని చెంతకువచ్చి ఆర్యా! పెక్కు దూరము నడిచి వచ్చితిరి. అలసటదీర బాదము లొత్తుదునా అని అడిగెను. ఆ మాటలకు సంశయమందుచు అతం డహో! యింత వరకు చేసిన యుపచారములన్నియు గృహస్థురాలికి దగునుగాని పరపురుషునంటి పాదములొత్తుట సతీధర్మముకాదు. ఈ చిన్నది దానికి యొడంబడుచున్నది. ఈదేశాచార మిట్టిది కాబోలు, యెంత అతిథియైనను పతివ్రత పెనిమిటికాక ఇతరునియొద్ద నొంటిగా నిలుచునా? అట్లు నిలుచుటయే తగదు మరియు బాదము లొత్తినచో మనము చాంచల్యమందక యాగునా? ఇంద్రియవ్యామోహము బలవంతమైనది విద్వాంసుని కూడ మోసము చేయగలదు. మళయాళదేశములో జారత్వసంకోచము లేదని వాడుక గలదు. దీనియభిప్రాయ మట్టిదిగా దోచుచున్నది. దీనినిజెంత నుండనిచ్చిన నేనును భ్రమజెందుదునేమో అని తలంచుచు దానికిట్లనియె.

సాధ్వీ ! నాకు శ్రమ యెంతమాత్రము లేదు. ఇంతదనుక నీవు చేసిన యుపచారమున కెంతేని సంతసించితిని. ఇక చాలును. ప్రొద్దుపోయినది. నీవుపోయి పండుకొనుము. నాపాదము లంటరాదని పలికిన అక్కలికియు బయ్యెట సవరించు కొనుచు మొగంబున జిరునగవు జిలుక దొలకరిమెరుపుతెరుగున మైదీగె మెరయ మరల అతని కిట్లనియె. ఆర్యా! మా దేశాచారము మీకు దెలియదు కాబోలు. మాకు నతిథిని సంతోషపెట్టుట కంటె యుత్తమవ్రతంబులేదు. అతిథినే దైవముగా భావింతుము. అతం డేమి కోరినను వలదన కిత్తుము. నీవు సంశయింపవలదు నీ యిష్టము దీర్చుకొమ్మని పలికెను. అతండా మాటలు సహింపక మంచము నుండి నేలకురికి యావల కరుగసాగెను . పిమ్మట నమ్మదవతియు నతని మతి కఱుగదని నిశ్చయించి ఆర్యా! పోకుము పోకుము రమ్ము. మంచముమీద బరుండుము. నీచిత్తమరయ నిట్లు చేసితిని. ఇక నిన్ను ముట్టనని యొట్టు పెట్టుకొని యతడు శయనించిన తరువాత నాగదినుండి మరి