పుట:కాశీమజిలీకథలు -02.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

32

కాశీమజిలీకథలు - రెండవభాగము

నిచ్చట నుండి మాయిల్లు పవిత్రముసేసి యుదయమున పోవచ్చును. మీకిష్టమువచ్చినట్లు భోజనము పెట్టుదుమని యతివినయముగా బ్రార్థించినది.

దానిమృదుమధురగంభీరవచనములకు వెరగుపడుచు నింద్రద్యుమ్నుండు ఓహో! ఈ చిన్నది మిగుల పతివ్రతలాగున దోచుచున్నది. సౌందర్యము గలిగి గర్వ మించుకయైనను బూనక యతిథిమర్యాద జేయుచున్నది. కొందరు మందమతు లింటికివచ్చిన బంధువునైనను తగురీతుల సత్కరింపరు. సాధ్వియైన భార్యవలన గదా యజమానునకు గీర్తిగల్గుట భార్యవశ్యురాలును, గుణవంతురాలును, పుత్రవంతురాలు నైనయెడల ధర్మార్థ కామములు దానియందేయున్నవని పెద్దలు చెప్పుదురు "భార్యామూల మిదం గృహ"మని దానంజేసియే వచింతురని పెక్కుగతుల మెచ్చుకొనుచు నింతతో బాటసారిమాట జ్ఞాపకము వచ్చుటచే నయ్యిందువదనతో సుందరీ! నేనిందు నిలువను. సత్రమునకు బోవలసిన యగత్యమున్నయది. నీ యాతిథ్యమునకు సంతసించితి బోయి వచ్చెదనని పలికి యందుండి పయికినడిచెను. మరి కొంతదూరము నడచి యొక యింటి యజమానునితో నయ్యా! పరదేశస్థులు నిలుచుటకై క్రొత్తగా గట్టిన సత్రమెంత దూరములో నున్నది. యీ మార్గమున బోయిన బోవునాయని యడిగెను.

అప్పుడాగృహము నుండి యొకజవ్వని రివ్వున మేడదిగి వచ్చి యతనిమది కచ్చెరువుగొలుపుచు నెదురుగా నిలిచి స్వామీ! మీరు పరదేశస్థులు సత్రము దూరములో నున్నది. ప్రొద్దుపోయినది యుదయమున బోవుదురుగాక. ఈ రాత్రి మా యిల్లు పావనము సేయుడని వేడుకొనినది. దాని మాటలువిని యారాజు వెరగు జెందుచు నోహో ! యీ యూరువారు మిగుల మర్యాద నెరిగినవారు. బాటసారి నాతో మరి యొకరీతిని చెప్పెను. ఇచ్చటివారి చర్యలేమియు గౄరముగా గనబడుటలేదు. సుగుణసంపత్తిలేక నీయూ రింతభాగ్యసంపన్నం బగునా వాని కేమి తోచి యట్లనెనో కాని నాకంత విశ్వాసయోగ్యముగా గనంబడలేదు. కానిమ్ము మరియు బరీక్షించెదంగాక యని తలంచుచు బోటీ! నీమాటలకు నేను సంతసించితిని నా కచ్చోటికి బోవలసిన యవసరము కలదు. పోయివచ్చెద నేటి కానతిమ్మని పలికి యా యిల్లుదాటి మరికొంత దూరము నడిచెను.

ఆరీతి నడిగినతావున నెల్ల నచ్చటియింటిచిన్నది వచ్చి లోపలకు రమ్మని వేడుకొనుచుండుటయు నన్నరవరు డద్భుతపడి తుదకు బాటసారిమాట బూటకముగా దలంచెను. అట్లు పెక్కిండ్లు దాటిపోయి మరియొక్కచోట దొంటితెరగున సత్ర మెంతదూరములో నున్నదని యడిగెను. ఆ మాట మేడమీదనుండి విని కృష్ణదాసనువాని భార్య ప్రజ్ఞావతి యనునది వడివడి మేడ దిగి వచ్చి దారి కడ్డముగా నిలువంబడి వినయంబున నిట్లనియె. అయ్యా! తమదేశ మెద్ది? యెచ్చటికి బోవుచు నిచ్చటికి వచ్చితిరి. సత్ర మడిగితి రేమిటికని యడిగిన నా రాజపుంగవుం డంగనామణీ! మాదేశము పెక్కుదూరములో నున్నది. ఒక కార్యార్థినై యిచ్చటికే వచ్చితిని. బసచేయుటకయి సత్ర మడి