పుట:కాశీమజిలీకథలు -02.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మళయాళ దేశము కథ

31

మళయాళ దేశము కథ

ఆర్యా! ఈ దేశముపేరేమి? ఈ పట్టణ మెవ్వరిది? ఇచ్చటి రాజధర్మము లెట్టివి? ప్రజ లెటువంటివారు? ఇచ్చటినుండి మార్గ మెచ్చటికిగలదు విశేషములేమైనం గలిగిన వక్కాణింపుమని యడిగిన నా బాటసారి యిట్లనియె. అయ్యా! ఇది మళయాళదేశము. దీనిని సంవత్సరమునుండి చండవర్మ యల్లుడు సింహకేతుండను రాజు పాలింపుచున్నవాడు ఇందలి ప్రజలు శక్తి నారాధింపుచు విదేశస్థులు వచ్చిరేని వారిని దాచి నవరాత్రిదినములలో బలియిచ్చుచుందురు. స్త్రీలపెత్తన మధికము సింహకేతుడు కడు ధర్మాత్ముడు సంవత్సరమునుండి యిచ్చటి దురాచారము కొంచెము తగ్గించెను. నీ వీచిక్కుల నెరుగవు కాబోలు నిం దెవ్వరింటను బసచేయకుము ఆ రాజుగారే విదేశస్తులకై సంవత్సరము క్రిందట నొక సత్రము నూతనముగా గట్టించినారు. అచ్చటికి బొమ్ము భోజనము పెట్టుదురు. గ్రామస్థుల మాయలం జిక్కకుండ రాజభటులు కావలియున్నారు. నేనును విదేశస్థుడనే నిన్న నొకపనిమీద నిచ్చటికివచ్చి యాసత్రములోనే భోజనము చేసి మా యూరికి బోవుచున్నాను. వెనుక పరదేశస్థుని బలాత్కారముగా బట్టుకొని పోవువారు. ఇప్పుడు చాలాభాగము తగ్గినది ఐనను, స్త్రీలయెడ కడుజాగ్రత్తగా నుండవలయును. లేనిచో మోసపుత్తురని యచ్చటి విశేషము లన్నియుం జెప్పెను.

ఇంద్రద్యుమ్నుం డాతని మాటలు విని సంతసింపుచు అయ్యా! నీవు కడు పుణ్యాత్ముడవు. ఈ పట్టణము గుట్టంతయు జెప్పితివి. లేనిచో నేను గూడ మోసపోవుదును కొత్తవారి కేమి తెలియును అని యతని స్తుతిజేయుచు వానిచే ననిపించుకొని గ్రామములో ప్రవేశించెను. ఇరుపక్కలను చక్కని మేడలపంక్తి యింపుగా గనంబడినది ఆ సౌధంబులన్నియు నలంకారభూయిష్టములై కుబేరుని తిరస్కరించు నా గ్రామస్థుల యైశ్వర్యమును ప్రకటించుచున్నవి. అది చూచువారికి స్వర్గమోయని తోచక మానదు. అన్నియు మేడలేకాని సాధారణమైన యిల్లొకటియులేదు. అంతకుమున్న తానుచూచిన పట్టణములలో నంత విచిత్రమైనది లేదు. కావున నింద్రద్యుమ్నుడు దాని రీతి నెంతయు మెచ్చుకొనుచు వింతలజూచుచు నా వీధింబడి నడువజొచ్చెను. అడుగడుగునకు నొకవిశేషము గనంబడుచున్న నిలబడి చూచుచుబోవ నాతనికి నడకసాగినది కాదు. ఆరీతిని కొంత దూరముపోయి యొక మేడకడ నిలువంబడి యొకరిని అయ్యా! విదేశస్థులు నివసించు సత్రమెంత దూరమున్నదని యడిగెను.

ఆ మాటవిని యాయింటిలోనుండి యొకవాల్గంటి పసిండిబొమ్మయనం దళ్కుతళ్కు మని మేనికాంతులు నలుదెసల బొదల చటాలున జనుదెంచి అయ్యా! ఇటు రండని తమరు పరదేశస్థులు గాబోలు సత్రము పెక్కుదూరములోనున్నది. ఈ రేయి