పుట:కాశీమజిలీకథలు -02.pdf/245

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

250

కాశీమజిలీకథలు - రెండవభాగము

లేక యోపిక కొలది చేయుచుంటిని. నే నొకనా డుచ్ఛిష్టపాత్ర లెత్తుచుండ అందొక నీచుడు, ఏమే సునందా! దాసీకృత్యములు చేయనేల నన్నుంచుకొనిన నిన్ను మిక్కిలి గౌరవముగా జూతునని పలికెను. ఆ మాటలు విని నేను దలవాల్చుకొని దైవకృత్య మిట్టిదిగదా యని కన్నుల నీరు గార్చుచు నా కృత్యములు చేయుచుంటినని చెప్పుచుండగా బుత్రకు లిరువురు గన్గొనల అశ్రుధారలు గారుచుండ, అమ్మా! వానిం బేర్కొనుము. నాలుక ముక్కలు ముక్కలుగా జీరుదుమని బల్కుచుండ నా సునంద తండ్రులారా! వాని నిందింపనేల? మనకాల మట్టిది నేను నా యవస్థ చెప్పి మిమ్ము సైతము దుఃఖము పాలు సేయుచుంటిని వాని మాటలకు నేనేమియు బలుకక యూరకుండినంత నా మెత్తదనము గ్రహించి ప్రతి పురుషుడు అట్లే అడుగ దొడంగిరి. అప్పుడు నేను బోయి అంబికతో నాకథ యంతయుం చెప్పి నీవు వారిని మందలింపని నాడు నేనేమి చేయుదాన బలాత్కరముగా మృతినొందెదనని చెప్పితిని. అప్పుడామె నన్నోదార్చుచు నా బొజగుల నందరిని మందలించినది.

మరికొన్ని దినములు చనినంత మిక్కిలి ధనవంతుడగు వైదేశికుండను వర్తకుడు నన్ను కామించి అంబికను వేడికొనియెను నాబుద్ధి యెరింగినదైనను అయ్యంబిక స్త్రీచాపల్యంబునం జేసి యొకనా డేకాంతముగా నన్నుజేరి అతని గౌరవమును, భాగ్యమును, సౌందర్యమును బొగడుచు నిట్లనియె. సునందా! నీతో నే నొక్కటి చెప్పదలచుకొంటిని. నీవిప్పుడు నడిమి వయస్సులో నుంటివి. ఆప్తులెవ్వరును లేరు. కాలుసేతు లాడినంత సేపుగాని యితరులు పైన బోషింపరు కదా! వైదేశికుడను వర్తకుడు నిన్ను కామించి యున్న వాడు. అతడు కోటీశ్వరుడు. అతనికి భార్య చనిపోయినది. ప్రాయము కొంచెము మిగులుటచే తిరుగ బెండ్లియం దిష్టములేదు. సంతానము కలిగియున్నది.

అతని నీవాశ్రయించితివేని నీకు దగిన మర్యాద జరుగును. అతని యింటి కార్యములన్నియు నీవె చక్క బెట్టవచ్చును. అతడు మిగుల మంచివాడు. దీన నీకేమియు గొడవ యుండదు. అట్లుచేయుట నాయభిప్రాయము నేనున్నంతకాలము నీకేమియు లోటులేదు. కాని నా యనంతరము నీవేమి అగుదువో యని చింతించుచున్న దాన అతనిం జేరితివేని నా మనంబు సంతసించును. నీ యభిప్రాయమేమని అడిగినది. అప్పుడు నేను గన్నీరు గార్చుచు, అమ్మా! నీకు సైతము నాయందిష్టము తగ్గినది కాబోలు. నన్నెన్నడు నిట్టిమాట లనియెరుగవు. ఇదియు నా ప్రారబ్ధమే. ప్రాణములు