పుట:కాశీమజిలీకథలు -02.pdf/243

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

248

కాశీమజిలీకథలు - రెండవభాగము

బూర్వమునుండియు నృపతులందరకును అదృష్టదీపుని జూడవలయునని అభిలాష గలిగియున్నది. కావున నా వార్త వినినతోడనే తమకుగల వస్తువాహనసామగ్రితో బయలుదేరి అతనియొద్దజేరిరి. వచ్చిన రాజులకు సుపచారములు జేయుటకు బెక్కండ్ర పరిచారకుల నియమించెను. ప్రతి భూపతియు అతండొక దివసము చేసిన విందు తమ జీతకాలములో నెరుగమని స్తుతిజేయదొడంగిరి.

వినినదానికన్న అతని యీవియెక్కుడుగా నున్నదనియు నిటువంటిదాత యిక పుట్టబోడనియు ఇతనికింత యైశ్వర్య మెచ్చటిదనియు అతండిచ్చు నొకమణి విలువ మనయైశ్వర్యమంతయు లేదనియు దమకు దోచినరీతిగా భూపతులు పొగడ దొడంగిరి అదృష్టదీపుడు ప్రకటించిన పదిదినముల కా సునందను వెంటబెట్టుకొని యొక బ్రాహ్మణుడు వారి యాస్థానమునకు వచ్చెను. ఆ వార్త రత్నవతిచే దెలిసికొని అదృష్టదీపుడు హరిదత్తుడును వేగముగా జనుదెంచి యా సునందంగాంచి యిరువురు చెరియొక ప్రక్కనుజేరి గౌగలించుకొనిరి. అప్పుడామె పాలిండ్లనుండి పాలు ప్రవాహముగా రాదొడంగినవి. వారిరువురు పుత్రులని తెలిసినప్పు డప్పడతి హృదయంబునం గల యానందము పట్టజాలక మగనిం దలచుకొని గోలుగోలున నేడ్చుచు నాయనలారా! మిమ్ములను గనటయే కాని మీ బాలక్రీడలను నర్మాలాపములను జూచుటకు నాకును, మీ తండ్రికిని యోగము లేకపోయినది.

దైవ మీరీతి మనకు వియోగము వ్రాసె నేమి చేయుదుము. కలిగియుండియు బేదలగతి జిక్కు బడితిరి. అన్నపానాదులవిషయమై సమయమునకు దొరకక యెన్ని చిక్కులంబడితిరో! మీ యాకలి యరసి పెట్టువారెవ్వరు! నేనేమి చేయుదును. దైవకృపచే జిక్కులంగడచి పెద్దవారైతిరి. నా కన్నులవాపు నేటికి తీరినదని శిరంబులు ముద్దుకొని తద్దయుం బ్రీతి గన్నుల బాష్పములు గార్చు తల్లినోదార్చుచు అదృష్టదీపుం డిట్లనియె. తల్లీ! నీవు వీరమాతవు సామాన్యకాంతవలె జింతింపదగదు. నీ విన్ని దినము లెవ్వనియింట నుంటివి. యెవ్వడు నిన్ను రక్షించెను. వాని బేర్కొనుము. వాని యిల్లంతయు బంగారము చేయుదును. మరి నీ కెవ్వడేని యువమానము గావించిన వాని హతము గావింతుము. నీ వృత్తాంతము దెలుపుమని యడుగగా అప్పడతియు గద్దియంగూర్చుండి కొడుకులు, కోడండ్రును, నాప్తులు జుట్టును బరివేష్టించి కొలుచుండ రత్నవతి మొగము జూచుచు నిట్లు చెప్పదొడంగెను.