పుట:కాశీమజిలీకథలు -02.pdf/241

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

246

కాశీమజిలీకథలు - రెండవభాగము

మాటున నుండి అచ్చటికిబోయి యేమని అడుగగా నామె నన్ను దిట్టుచు నిన్నింట బెట్టుకొని జదువు చెప్పించుచున్నందులకు మంచిపనియే చేసితివిలే కానిమ్ము. నీ గురువు రానీ అని నన్ను మందలింపుచు నిరుగుపొరుగు వారిని కేకలు వైచినది. అప్పుడు వారు కొందరు వచ్చి అది చెప్పిన మాటలు నమ్మి నన్ను నిందింప దొడంగిరి. అంతకు మున్నది గుణవంతురాలని యెల్లరు చెప్పుకొనుచుందురు. కావున నేనేమి చెప్పినను లాభము లేకపోయినది నేను గాదిమాటున దాగియుండట దాని మాటలకే యుచితముగా నున్నది.

నేనును దప్పుచేసిన వానివలె దలవాల్చుకొని దైవకృత్యమునకు వగచుచు నెట్టకేల కారాత్రి వేగించితిని. ఉదయంబున సోమశేఖరుడు వచ్చినంత నా వృత్తాంత మంతయు భార్య చెప్పినది. అప్పు డతడు దుర్వాసునివలె మండిపడుచు నన్ను జీరి, యోరీ! కృతఘ్నుడా! తృణచ్ఛన్న కూపంబువలె గుణవంతుని పోలిక నొప్పుచుంటివే దరిద్ర చూడామణివైన నిన్నంటబెట్టిన నెట్లు సేయుదువు? నీ పోలిక పుస్తకము తీసికొని రమ్మని చెప్పి యంపినప్పుడును నర్థరాత్రము బైటకు వచ్చినప్పుడును ననుమానించితిని. ఆ సమయములలో నిర్బంధించితివనిగూడ మా సత్యవతి చెప్పుచున్నది. ఆసతీతిలకము నీ అందమునకు లోభించు ననుకొంటివి కాబోలునని పెక్కు తెరంగుల నిందించుచు మా యింటినుండి లేచిపోమ్మని దుడ్డుకర్ర తీసికొని కొట్టవచ్చెను.

అప్పుడు నేను దెబ్బలకు వెఱచి యిల్లు వెడలి పారిపోయితిని. నన్ను జూచిన వారెల్ల నన్నే యన్యాయము చేసినవానిగా భావించి నిందింప దొడంగిరి. అప్పుడు నేను దైవమును దిట్టుచు నిష్కారణము ప్రజలు నన్ను నిందించుచుండ బ్రతికియుండటకన్న మృతినొందిన యుక్తముగా నుండును. సత్యమునందు భగవంతు డుండునను మాట అసత్యమైనది. దైవమును వంచించుటకు సమయుటకన్న వేరొండుపాయములేదని యూహించి చాపుకొఱకు పెక్కుమార్గము లూహింపుచు దైవగతి నీయూరుజే రియిందీవృత్తాంతము విని నేనా ప్రశ్నలకుత్తరము జెప్పెదనని పూనుకొంటిని. ఇంతియేకాని ప్రియంవద యందుగల మక్కువచేతగాదు అని చెప్పగా అదృష్టదీపుడును తక్కినవారు ఆతని చిత్తనైర్మల్యమునకు మిక్కిలి సంతసించిరి.

అదృష్టదీపుడట్లు దేవీసౌధము తనయధీనము చేసికొని దానిలో గొన్ని రత్నములు బంగారము గైకొని అచ్చటనుండి వారితో గొండ దిగి బండియెక్కి మిగుల వైభవముతో రాజవాహనుని కోటలోనికి వచ్చెను. రాజవాహనుడును పుత్రికచే నతం