పుట:కాశీమజిలీకథలు -02.pdf/240

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సత్యవతి కథ

245

గాక తల్లిదండ్రులు విడుతురుగాక. ఇట్టిసుఖము విడువనేర్తునే యని యధరరసంబాన నెన్నియో ప్రయత్నములు చేసినది. నేను దొరకనిచ్చితినికాను. నాకు దాని దప్పించుకొనుపాటి సామర్థ్యము గలిగియున్నను పెనంగినచో దాని అవయవములు ముట్టవలయునని యుగ్గబట్టుకొని యుంటిని. అంగస్పర్శ మాత్రమునకే యది సంతసించు చుండెను. నేనప్పుడు కామాహతకుని ప్రభావమును గురించి వే తెరంగుల దలపోయు చుంటిని. అదియు నా వీపు చుంబించుచు శిరమునం బొడుచుచు నీరీతి గొంతసేపు పెసంగి, పెసంగి చివరకు నాపలేక తటాలున పట్టువదలినంత నేను మృత్యుముఖంబు నుండియుబోలె నందుండి తప్పించుకొని పారిపోయితిని.

సత్యవతియు గొంతసేపు మరల నేను వత్తునేమో యని యింటిలో గూర్చుండెనుగాని యెంతసేపటికి నేను రానందున మిగుల కోపముతో నాయిల్లు వెడలి నలుమూలలు వెదకినది. నేను దానికి గనబడకుండ గాదిమూలను డాగియుంటిని. అప్పుడు దానికి మొదట నాయందెంత ప్రేమ గలినదో యంత కోపమువచ్చి నిరాస జేసికొని యావాకిటిలో నిలువంబడి, దుర్మార్గుడా! నీ కొరకు నేనెంత ప్రయాసపడివచ్చిన నిరసించితివే! ఇక నీ పాట్లు చూచుకొనుమని పలుకుచు వస్తువులు పారజిమ్మి తల విరియ బోసికొని మేను జీరికొనుచు అమ్మో! అని యరచినది ఆ ధ్వని వినినతోడనే దాని తల్లి జడియుచు వాకిటకువచ్చి యేమియని అడిగెను.

అప్పుడా సత్యవతి యేడ్చుచు తల్లి తో, అమ్మా! నేనేమి వక్కాణింతును. నీ మగడు వివేకములేక నిర్భాగ్యుని నింటబెట్టుకొనియెను వాడు నా మీదను మొదటి నుండియు గన్ను వైచి యుండెను. నేనది గ్రహించి తప్పించుకొని తిరుగుచుంటిని. ఈ రాత్రి నేను వాకిటికి వచ్చితిని. నీవు నిద్రలో నుంటివని లేపితినికాను. వీడది యేగతి గనపెట్టెనో తానుగూడ వాకిటకివచ్చి నా చేయి పట్టుకొని నిర్బంధింపగా వలదు వలదని నేనెన్నియో నీతులు జెప్పితిని. నా మాటలు లెక్క సేయక బలత్కారముగ నాపైబడి సమ్మతింపనందులకు గోపమువచ్చి మేనంతయు జీరెను. శిరోజములు గ్రహించెను. చూడుము నిన్ను బిలిచినంత బారిపోయి యెచ్చటనో దాగియున్నవాడు. నా తండ్రి యింటలేక పోవుటచే నా కిట్టి యాపద వచ్చినది అని బిగ్గరగా నేడువ దొడంగినది.

దాని యేడుపు వాడు చిక్కలేదనియే కాని మరియొకటి కాదు. అప్పుడు తల్లి కూతురినోదార్చుచు, హరిదత్తా! హరిదత్తా! అని నన్ను జీరినది. నేనును గాది