పుట:కాశీమజిలీకథలు -02.pdf/239

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

244

కాశీమజిలీకథలు - రెండవభాగము

పడియెదవని మెల్లగా జెప్పుచుంటిని. ఇక నిట్టియూహ విడువుమని చెప్పుచుండగా నది తల్లి పిలిచినందున నా మాటలు లెక్కగొనక తటాలున నా చెక్కులు ముద్దుపెట్టుకొని అవతలకు బోయినది. నేనును పాపభీతీచే నుల్లము ఝల్లుమన దుడుచుకొనుచు హరి హరీ అని పలుకుచు నా పుస్తకమును గొని మరల గురువునొద్దకు బోయితిని.

ఈరీతి బెక్కుసారులు నాకెదురుపడినప్పుడెల్ల తన అభిప్రాయము వెల్లడిచేయుచుండ నేను ద్రోసివేయుచుండువాడను. చివర కొకనాడు మా గురువుగారు గ్రామాంతరము వెళ్ళిరి. ఆ దినమున నా చిన్నది చక్కగా నలంకరించుకొనుట జూచి నేను మిక్కిలి భయపడుచు నేడేమి సాహసము చేయునో అని వెరచుచునే యుంటిని దైవ సంకల్ప మెవ్వడు తప్పింపగలడు?

ఆ రాత్రి జివరకు నాకు నొంటరిగానే పరుండుట తటస్థించినది. తల్లికి దానియందు నమ్మకము గనుక నెచ్చటికి బోయినను శంకించునదికాదు. అంతకు బూర్వము దాని నట్టిదానిగానే చెప్పవచ్చును. ఆ రాత్రి నేను బండుకొనిన కొంచెముసేపునకే ఘుమంఘుమితముగా బరిమళము వ్యాపింపగ నా యొద్దకు వచ్చి దీపమును మబ్బుచేయక నన్ను లేపుచు నేనును దల్లడిల్లి లేచినంత దన కౌగిటిలో బిగ్గరగా నదిమిపట్టి యిటునటు గదలనీయక గంఠంబు ముద్దుకొనుచు నీరీతి నల్లరిచేయ మొదలుపెట్టినది. అప్పుడు నేను మనంబు చలింపకుండ భగవంతుని ధ్యానము జేయుచు బ్రాణములుగ్గబట్టికొని దాని సందిటిలోనుండి తప్పించుకొనవలయునని యెంత ప్రయత్నము చేసినను దానికెంత బలము వచ్చినదో కదలలేక పోయితిని.

పట్టువిడచిన బారిపోవుదునని కాబోలు నది యెంత సేపటికిని విడిచినదికాదు. అప్పుడు నేను బాలా! నీవీ రీతి సతీధర్మమును విడుచుట మంచిదికాదు సుమీ! మీ తండ్రి యింటికి గళంకము తెచ్చి పెట్టుచున్నావు. దీన నేమియు లాభములేదు. నాకును నీకును వాసికాదు. నన్ను విడువుము. నేను నీ యభిలాషకు లోబడువాడను కాను నా వలన నీకేమియు బ్రయోజనములేదు. నిన్ను గుఱించియే నేను జింతించుచుంటినని యెన్నియో నీతులును సామ్యములు జెప్పితిని. కాని వానినేమియుం బాటింపక యా పాటలగంధి నా కిట్లనియె.

సుందరుడా! నా కిప్పు డించుకయు నొడలు దెలియుట లేదు. నీ నీతులేమియు నాచిత్తమున కెక్కవు పెక్కుదినములనుండి యవసరము చిక్కక యెన్ని యో చిక్కులు పడితిని. నేటికి నా పురాకృతము ఫలించినది. ఒక్కసారి నీయధరామృతము గ్రోలనిమ్ము. తరువాత నేమి చెప్పినను వినియెదను. బంధువులు వెలిబెట్టినను బెట్టుదురు