పుట:కాశీమజిలీకథలు -02.pdf/238

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సత్యవతి కథ

243

యథాపూర్వకముగా సరస్వతీమందిరములో బరుండి రెండుయామములు వరకు బాఠములు చదువుకొని నిద్రబోయితిని.

ఆ చిన్నదియు రాత్రి జక్కగా నలంకరించుకొని మనంబున గోరికలూర నేనున్న గదిలోకి వచ్చి దీపమారిపి నా యురముమీద వ్రాలినది. నేనును పిశాచమను వెరపుతో నరవబోయి అంతలో దాని మేని సుగంధంబు తావిం జేసి గురుతుపట్టి, అయ్యో! నే నిప్పు డల్లరి చేసినచో గురువుగారి కపకీర్తి వచ్చును. ఈ చిన్నదియు నింద పాల్పడును. కావున మెల్లగా జెప్పి పంపెదనని తలంచి లేచి కూర్చుండి అక్కాంత చేయి పట్టుకొని సంజ్ఞలచే నీ పని మంచిదికాదని చెప్పితిని. అదియు వేరొక అర్ధము చేసినది కాబోలు అందరును నిద్రబోవుచున్నవారు. మన కేమియు భయములేదు ఇష్టము తీర్చుకొనుట కింతకన్న నవసరము దొరకదని చెప్పినది. ఆ మాటలు విని నేను ఓహో! ఇది యిప్పుడున్మత్తయయియున్నది. దీనికేమి చెప్పినను నాటదు. తప్పించుకొని పోవుటకంటె మంచిమార్గములేదని యూహించుచు నది మీదబడుచు గౌగలించుకొన పోవుచుండ జేతులతో నాపుచు వాకిటకు పోయి చూచి వచ్చెదను నుండుమని దాని చెవిలో మెల్లగా నూదితిని. అది నిజమనుకొని నన్ను విడచినది. నేనును జీకటిలో దడుముకొనుచు వాకిటకు బోయినంత మాగురువుగా రచ్చటికి వచ్చి యెవ్వరని అడుగగా నేనని యుత్తరము జెప్పితిని. నీవకారణముగా నిట్లు వచ్చితివేమి అని అడుగగా బెదరుచు సరస్వతీమందిరములో దీపమారిపోయినది. వెలిగించటకు వచ్చితినని చెప్పగ నతండును దీపమిచ్చి మరల బోయి పరుండెను.

అప్పుడా చిన్నది యెట్లు తప్పించుకొని పోయినదో తల్లియున్న యింటిలోనికి బోయినది. అమ్మరునా డుదయమున లేచువరకు నా యొద్దకువచ్చి మొగము గడిగికొనుటకు నీళ్ళు దెచ్చి యిచ్చెను. మఱియు నూరక పలుమారు రాదొడంగినది. దాని చర్యలన్నియు హృదయంబున వెరపుగలుగజేయ దొడంగినవి. మఱియు నాలుగు దినములు గడచిన వెనుక నేను గురునానతి పుస్తకాగారమునకు బోగా దారిలో నడ్డము నిలిచి సుందరుడా మనకు మంచి సమయము దాటినది. ఆ దినము నీవు లేచి చూడకపోయితివేని ప్రమాదము వచ్చు సుమీ. ఇప్పుడు మంచి సమయము కాదు. నీ విచ్చటికి వచ్చుట చూచే వచ్చితిని. ఒకసారి చెక్కిలి ముద్దు బెట్టుకొని పోయెద గౌగలింతయైన యబ్బుటలేదు. ఎప్పుడు చూచినను విద్యార్థుల నడుమనే యుండెదవేమి? చాలులే నీ మూలమున నాకు నిద్రాహారములు లేకున్నవని పలుకుగా నేను, అక్కా! నా విషయములో నీవట్టి అభిప్రాయము గలిగియుండట తప్పు. నీవు నాకు గురుపుత్రికవు అక్క వగుదువు అదియునుంగాక నేను బరకాంత నంటువాడను కాను. నీవల్లరి