పుట:కాశీమజిలీకథలు -02.pdf/237

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

242

కాశీమజిలీకథలు - రెండవభాగము

ఇప్పుడు చెదరినదని తోచుచున్నది. ఇంద్రియములు కడు చంచలములు గదా? ఎట్లైన నీయాపద దాటినజాలని తలంచుచు ధైర్యముతో అది యేమో చెప్పుమని పలికితిని.

అంత నన్నెలంత సిగ్గు విడచి నలుమూలలు తిరిగి చూచుచు మేను కంపింప సన్ననియెలుగుతో సుందరుడా! నేనొక్కటి చెప్పెద వినుము. భగవంతుడు ప్రజల సృజించుటయు అవయవము లిచ్చుటయు సుఖించుట కొరకేగదా? సుఖమన విషయాభిలాష యింద్రియవ్యాపారము సర్వజంతుసామాన్యమైనది. దానం జేసి పుణ్యాపుణ్యంబులు గలుగుననుట మనుష్యకల్పితము. తల్లిదండ్రు లెవ్వరికి కట్టిపెట్టినను వానిని దైవముగా జూడవలయుననిగదా శాస్త్రబోధ. అది యెంత యుక్తియుక్తముగా నున్నదియో చింతింపుము. వాండ్రు స్వల్పబుద్ధులయు అన్యాయము చేయబూనినచో గన్యబ్రతు కేమి కావలయును. అది నా మతము గాదు. మదవతి యౌవనంబున మొదట నెవ్వని వాంఛించునో వానిని దైవముగా జూచునది. వానిని విడచిన దోషము వచ్చును. ఇంత యేల? యిప్పుడు నేను పూర్ణయౌవనములో నుంటిని. నన్ను జిన్నప్పుడే యెవ్వనికో పెండ్లి చేసిరట. అది నే నెరుంగను. ఆ మూఢుడు కాశిలోనుండి విద్యాభ్యాస మేమిటికో చేయుచున్నవాడట !

నేను వానిని దైవముగా భావించి యేమి చేయదగినది? ఆకలి అగునప్పుడు గదా అన్నము తినవలయును. ఇంద్రియములనాప నెవ్వరితరము? ఇప్పుడు నిన్ను నేను కామించితి ననుకొనుము. తరువాత నిన్ను విడచితినేని యుత్కృష్టదోషము రాక మానదు. ఇదియే నా యభిప్రాయము నా మతములో నీవేకీభవింతువా లేదా? అని అడుగుచుండగనే గురువుగారు భోజనముచేసి లేచి వాకిటనిలచి, హరిదత్తా ! ఇంత యాలస్యము చేసితివేల? పుస్తకము దొరకలేదా యేమి? లేకున్న వచ్చి భోజనము సేయుము రేపు చూచుకొనవచ్చునని పలికెను.

ఆ మాట వినినతోడనే బెదరు గదుర నిదిగో! వచ్చుచున్నవాడినని పలుకుచు దటాలున లేచి అచ్చటికి బోయితిని. మా గురువుగారేమిరా యింత యాలస్యము చేసితివని అడుగగా బొత్తము గనంబడ నందున వెదకుచుంటినని యుత్తరము చెప్పితిని. నా వెనుకవచ్చిన యా చిన్నది నేను మరుగుబెట్టి చెప్పినందులకు సంతసించుచు నా మొగము జూచి నవ్వినది. నేను దాని నగుమొగము జూచి గుండె ఝల్లుమన నయ్యో! ఇదియేమి పాపము. నా యభిప్రాయ మీప్రోయాలు గ్రహింపకున్నది. మరల నేకతముగా దొరకినప్పుడు చెప్పెదనని తలంచుకొని యా రాత్రి భోజనముచేసి