పుట:కాశీమజిలీకథలు -02.pdf/236

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సత్యవతి కథ

241

నేను - పదియారేండ్లవరకును.

ఆమె - తరువాత-

నేను - ముప్పదియేండ్లవఱకును దరుణియనంబడును.

ఆమె - బాలకేమి ప్రీతి?

నేను - తాంబూల మాల్యాను లేపనాదులు.

ఆమె - తరుణికో?

నేను - ఏమియుజెప్పక యూరకొంటిని.

ఆమె - సుందరుడా! నావంక చూడుము. నేను బాలనో, తరుణినో చెప్పగలవా?

నేను - నాకేమియుం దెలియదు.

అనుటయు నా చిన్నది నగుమొగముతో, హరిదత్తా? నీవు గ్రంథము చదివితివి కాని అనుభవమేమియు లేదుసుమీ! అని పలికినది అప్పుడు నేను అక్కా! ఇది మేమనుభవము కొరకు చదివినది కాదు. కావ్యలక్షణములకై చదివితి మని చెప్పితిని. అప్పుడప్పడతి అగునగు నీకు దాని అనుభవమే యుండినచో నింత చక్కనివాడవయ్యు నీ యౌవనమంతయు నూరకపోనిత్తువా? నీవు కోరిన నీ యూరిలో సమ్మతింపని మూఢకాంతయున్నదా? అని పలికినది. అప్పుడు నేను శివ శివా! రూపమును, విద్యయును దుష్టకార్యములు చేయుటకేనా! ఈ రీతి నెన్నడును తలంపగూడదని పలికితిని.

పిమ్మట అమ్మదవతి యీ మాటలకేమిలే! అబ్బిన అందాకనే. నీవింకను నాచవి చూచినవాడవు కావు కనుక నిటులనుచున్నావు. మహర్షులు గూడ నీ మోహములో బడిరను కథలను జదువలేదా యేమి? అని పలుకగా అక్కా! ఆ ప్రసంగ మిప్పుడేల? పుస్తకమును వెదుక నీదీపము తిన్నగా జూపుము. మీ యమ్మ పిలుచుచున్నటుల నున్నది దీపమందుంచి పొమ్మని బలుకగా అక్కలికి యించుక కొంకుచు అయ్యో! పోయెదనులే. నీతో నెన్నియో దినములనుండి యొక విషయము చెప్పవలయునని తలంచుకొని యుంటిని యెప్పుడును సమయము దొరికినది కాదు నేటికి దొరికినది. ఆ మాట నితరు లెవరును వినకూడదని పలుకగా నేను భయపడుచు నోహో! మోసము వచ్చుచున్నదే? ఈ చిన్నది యిదివరకు నీతిశాలి యయినను