పుట:కాశీమజిలీకథలు -02.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విశాలాక్షి కథ

29

పోయెను. అందు ముందు సేనానివేశస్థానమే కనంబడినది. శిబిరమంతయు దునకలై పడియున్నవి. ఏనుగులు గుర్రములు కాల్బలము నుగ్గయియున్నవి. భటులెవ్వరును లేరు అప్పుడారాజు భార్యందలచుకొని అయ్యో? నిన్ను నిష్కారణ మీ యడవిపాలు సేసితినే. నీ విషయమంతయు బరామర్శింపనైతిని అక్కటా! అక్కల ఫలంబిది కాబోలునని పరిపరిగతుల శోకించుచు దద్విధంబరయ కొంచెము దూరముపోయెను. అప్పుడొక చెట్టుమీదనుండి యొకడు స్వామీ! యని కేకలుపెట్టెను. ఆ కేకలు విని యింద్రద్యుమ్నుడు తల పైకెత్తగా నందు మనుష్యుడున్నట్లు కనబడిన నిలువంబడి నీవెవ్వడవు? చెట్టుపైన నేటికుంటివని యడుగగా వాడు మెల్లన చెట్టుదిగివచ్చి మ్రొక్కుచు నిట్లనియె.

దేవా! నేను దేవరపరిచారకుడ సింహభీతిచే జెట్టెక్కితిని. మీ రెచ్చటనుండి వచ్చితిరి? సింహమేమైనది తెలుపుడని యడిగిన నారాజిట్లనియె ఓరీ! సింహము చచ్చి పదిదినములైనది. నీవెఱుగక యింకను జెట్టుపైనేయుంటివి మరియు మన సైన్య మంతయు నేమైనది? నా పట్టమహిషి కుశలముగా నున్నదా! ముందు జెప్పుమని యడిగిన వాడిట్లనియె. స్వామీ! మాయమ్మగారి కేమియు గష్టములేదు. సింహము విజృంభించినతోడనే చుట్టును బలములాయుధపాణులై తోడరా బల్లకీనెక్కి పట్టణమునకు వెళ్ళినది. వాహినీపతియు సహాయార్థమై యామె వెంటనే పోయెను. ఆమెను సురక్షితముగా నీపాటి కింటికి జేర్చును. దేవరవారికి వర్తమానము జెప్పుటకు దండనాయకుడు నన్నిందుంచెను. నేనును దేవరరాకకై వేచుచు సింహభయమున నీ చెట్టుపైన నిలిచితిని. ప్రాణమన్న నందరకు భయమెగదా? మిమ్ముంబొడగంటి. నాకు మరల ప్రాణములువచ్చినవి. ఇంతవరకు నాసింహమెప్పుడు వచ్చునోయని యొంటిప్రాణముతో నుంటిని. అమ్మగారి రక్షణము మిష పెట్టుకొని యీ భయముచేతనే యందరు నింటికి బోయిరి. ఇదివరకెన్నడును నిట్టి భయంకరమైన మృగమును చూచియుండలేదు. దానిని దేవరగాబట్టి చంపిరి. మరియొకరు చంపలేరని స్తుతిజేయ మొదలు పెట్టెను.

అప్పు డారాజు భార్య సురక్షితముగా నున్నందులకు సంతోషించుచు సింహము చచ్చినరీతి వానికిజెప్పి యొకచీటివ్రాసి తన కుమారుడు విజయున కిమ్మని చెప్పి వాని నంపెను. పిమ్మట నమ్మనుజనాయకుడు విశాలాక్షి క్షేమమరయుటకై వెదకికొనుచు మునుపుచూచిన తావునకరిగెగాని యందామెజాడ యేమియులేదు. గుర్రమును గనబడ లేదు. గుర్రపుటడుగులు మాత్ర మెచ్చటికో పోయినట్లు చెప్పుచున్నవి. అపథచిహ్నములబట్టి కొంతదూర మయ్యడివిలో వెదకజొచ్చెను "విశాలాక్షి" యని పెద్దయెలుంగునం బిలువజొచ్చెను. ఎందును విశాలాక్షి యున్నట్లు కనంబడలేదు. పిమ్మట నతం డాప్రాంతమందున్న కోయపల్లెలకుబోవుచు నాపూబోడివృత్తాంత మడుగుచుండెనుకాని యెవ్వరును నేజాడయు జెప్పలేదు.