పుట:కాశీమజిలీకథలు -02.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

28

కాశీమజిలీకథలు - రెండవభాగము

గుర్రమును దోలెను. సాయంకాలము వరకు నయ్యడవి యంతయు దిరిగినను సింగము గనబడలేదు. అంత మరునాడుగూడ వెదకుచు బోయినను దృష్టిగోచరము గాలేదు. ఈ రీతి బదిదినములు దారి తెలియక చూచిన పొదలే చూచుచు జొచ్చిన కోనలే చొచ్చుచు దిరుగుచుండగానొకకోయపల్లె గనబడినది.

ఆ పల్లెలోనికి బోయి వాండ్ర నందరింజీరి యోరీ! యీ యడవిలో దిరుగుచున్న సింహ మీపెడకు రాలేదుకద! దానిజాడ మీకేమైనం దెలిసినదా! యని యడిగిన నవ్వుచు వాండ్రిట్లనిరి. సామీ! మీకు దెలియదుకాబోలు! సింగము సచ్చి పది దినములైనది. దాని మాంసము మేమే తింటిమి. పదిదినములనుండి నిర్భయముగా నిదురించుచుంటిమని చెప్పగా నతం డాశ్చర్యము జెందుచు నేమేమీ! సింహము చచ్చిపోయినదా! దాని జంపిన బలశాలి ఎవ్వడు? మా యోధుడా లేక మరియొకడా? తెలిసినచో జెప్పుడని యడిగిన వాండ్రిట్లనిరి.

అయ్యా ! అతండు మీయోధుడో మరియొకడో మాకు దెలియదు. పదిదినములక్రిందట యుదయమున మాయూరివారు కొందరు పొలమునకు బోవుచుండగా నొక పుంతదారిలో నొకడు పడియుండెనట. వానికి మొలలో కత్తియున్నది. మంచిదుస్తులు ధరించియున్నవాడు. నీవెవ్వడవని యడిగిన స్మృతిలేనందున గన్నులు మాత్రము దెరచెనుగాని మాట్లాడలేదు. పిమ్మట వాండ్రు వానిని దప్పికొని యున్నవానిగా నిశ్చయించి వెదురుగొట్టములోనున్న నీటిచే నతని స్నానము చేయించిరట. దాన దెప్పిరిలి యతడు లేచి కూర్చుండి వానితో నెద్దియో మాట్లాడబోవు సమయమున సింగము సింగమని యరచుచు నీ పల్లెలోనివారెల్ల నామీదుగా బారిపోవ దొడంగిరి.

అప్పు డమ్మహాపురుషుండు తనకట్టిబల మెచ్చటినుండి వచ్చినదో వెరవకు డని పలుకుచు లేచి వరనుండి కత్తిదీసి యాసింహమున కెదురుపోయెను. అదియు గాండ్రుమని మీదికురికిన బెడిదంపుటడిదము వ్రేటున దానిం బరిమార్చెను. పిమ్మట మేమందరము ముక్కలుముక్కలుగా నరికి మాకసిదీరునట్లుగా నేటివరకు దాని మాంసమే తినుచుంటిమి. ఆవీరుడంతట నెద్దియో ధ్యానించుచు గన్నీరు నించుచు మే మెంత స్తుతియించుచున్నను సంతసింపక తనతోవనుబట్టిపోయెను. అని చెప్పగా విని యారాజు వెరగుపడి యోహో! ఆతఁడు విశాలాక్షి మగడు గాడుగద. వాని కంతబల మెచ్చటినుండి వచ్చినది? మొదట చిహ్నములన్నియు వానివిలాగేయున్నవి. ఇట్టి వాడైనచో విశాలాక్షికి జింతయేలగలుగును? పాప మయ్యయో! విశాలాక్షి మాట మరచిపోతినే? సింహవార్తలచే దటాలున జనుదెంచితినని ఆమె పిమ్మటనేమయ్యెనో! వేగబోయి యరయవలయునని నిశ్చయించి యాగుర్రమెక్కి వడిగా నామార్గమునం బట్టి పోయెను.

అతండెంతవడిగా బోయినను నాలుగు దినములకుగాని యచ్చటికే జేరలేక