పుట:కాశీమజిలీకథలు -02.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విశాలాక్షి కథ

27

యీ గుఱ్ఱము నేనెంత కళ్ళెము బిగియబట్టినను లక్ష్యముసేయక యెగిరి యెగిరి యతివేగముగా బరువెత్త జొచ్చినది.

ఇక చెప్పునది యేమున్నది! మొదటిగంతులోనే గుఱ్ఱముపై నిలువలేక యరచుచు నా పెనిమిటి తటాలున దలక్రిందుగా నేలబడియెను. కన్నులార జూచియు గుఱ్ఱము నాపలేక యింతదూరము దాటి వచ్చితిని. వాయువేగముగా బరువిడి వచ్చిన యీ గుఱ్ఱము యిచ్చటికి వచ్చియాగినది. అతడు పడినతావు మిగుల దూరముగా నుండవచ్చును. అప్పుణ్యాత్ముం డీపాటికి నాకలోకసుఖం బనుభవింపుచుండును. పాప మాయన నే నేమి చెప్పినను దానింజేయువాడుగాని నామాట నించుక యతిక్రమింప లేదు. దైవమువంటి పెనిమిటిం జంపిన పాపాత్మురాలను, గ్రుక్కెడు ప్రాణమునకై యాసపడినప్పుడు గదా యిన్ని చిక్కులంబడ వలసి వచ్చినది. ఇంక నీజన్మమునకు నాకు సుఖము గలుగదని తలంచి ప్రాణము పోగొట్టుకొన నురి కంఠమునకు దగిలించికొంటిని ఇంతలో మీ దూతలువచ్చి నన్నాటంకపరచిరి. పిమ్మట మీరు వచ్చితిరి గదా? ఇదియ నా వృత్తాంతము నన్ను జావనిండు మీ పాదములకు మ్రొక్కెదనని యేడ్చుచు నాచిన్నది మిక్కిలి బ్రతిమాలుకొన్నది.

అట్లు విశాలాక్షి వృత్తాంతమువిని యింద్రద్యుమ్నుండు పెక్కుగతుల బొక్కుచు నయ్యో! తల్లీ! నీవా! నీతండ్రి నాకు బినతల్లి కుమారుడు. అతండు మృతుండైన వార్త నేను వినలేదు. కటకటా! నీవు తగని యిడుములం గుడిచితివి. చింతింపకుము. నీమగడు సురక్షితముగా నున్నట్లు నీ మొగమే చెప్పుచున్నది. అది యిసుకనేల యగుటచే గ్రిందబడినను దెబ్బ తగులదు. నీపెనిమిటిని శీఘ్రమ వెదకి తెప్పించి నీతో గూర్చెద. నావెంట రమ్ము పోద మాశిబిరంబున మీ పినతల్లియున్నది.

అని బల్కి యోదార్చుచున్న సమయంబున దన శిబిరము వైపున హల్లకల్లోలముగా, గోలాహలధ్వని వినంబడినది. అదేమియోయని దృష్టి నాదెసకు జొనిపి విమర్శింపుచుండ గొందరు రాజభటులు పరుగున వచ్చుచున్నట్లు గనబడినది. వారిరాకకు వెరచుచు నారాజు కొంచె మెదురు నడిచి యింత తొందరగా వచ్చుచున్నా రేమి యని యడుగుచుండగనే యొగర్చుచు స్వామీ ! యా సింహము వచ్చి మనసేనలనెల్ల చెల్లాచెదరు చేసినది. ఏనుగులు గొలుసులు ద్రెంచుకొని గుర్రములను, గాల్బలములను నుగ్గునుగ్గుగా ద్రొక్కుచు బారిపోవుచున్నవి. సింహము సేనానివేశము చుట్టు కొరవి త్రిప్పినట్లు తిరిగివచ్చి ముందు గజముల భుజింపుచున్నది.

దేవిగారి కేమిమోసము వచ్చునోయని వాహినీపతు లందరు భయపడుచున్నారు. దేవరవారు త్వరగా విచ్చేయవలయునని పలికిన నులికిపడుచు గడువడిగా గుర్రమునెక్కి యచ్చటికి బోవుచుండ మరి కొందరడ్డమువచ్చి దేవా! యాసింహ మిప్పుడే యీ వైపుగా బోయినది. అది యొక చోట నిలిచియుండదని చెప్పిన నాదెసకు