పుట:కాశీమజిలీకథలు -02.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

26

కాశీమజిలీకథలు - రెండవభాగము

తెరచువిధము పుస్తకము చూచి తెలిసికొంటిని. వేరొకవిధమున బ్రహ్మకు దెలియదు. ఆహా! పనినమర్చినవా డెంతనేర్పరియోగదా? తలుపు తెరచినంత గుహలాగున విశాలముగా నొకబిలము గనంబడినది. మే మీగుర్రముతో నా గుహలో ప్రవేశించి యాపుస్తకములో చెప్పిన చొప్పున మరల నాతలుపు మూసితిని ఆ పుస్తకమును విడువక యాదారింబడి నడువజొచ్చితిమి. అందు నడుమ నడుమ గొప్పమాణిక్యముల నమర్చి యుండుటచే నింతైన జీకటిలేక పట్టపవలు లాగున నున్నది. రాజవీధివలె నొప్పుచున్న యాబిలములో నీగుర్రము నెక్కి నామగని వెనక నెక్కించుకొని కళ్లెము పట్టుకొని కొంతసేపు మెల్లగా గుర్రమును నడిపించితిని.

నామగనికిఁ దురగమెక్కు పాటవము లేదు. కావున నే మాత్రము గుఱ్ఱమును వడిగా నడిపించినను నా నడుము బిగ్గరగాఁ బట్టుకొని మొర్రోయని యరచువాఁడు. వెరవకుము. నా నడుము గట్టిగాఁ బట్టుకొనుము నీకేమియు భయములేదు. కొంచెము వేగముగా నడిపించినంగాని యీ బిలము దాటి పోలేమని నేనెంత చెప్పినను నతని భయము పోయినదికాదు. అతఁడట్లెంత యరచినను నడుమ నడుమ వడిగా నడిపించుచు మరల మెల్లగా దోలుచు ఈరీతినిఁ బెద్దతడవు పోయితిమి. అందు దినరాత్రివిభేదము తెలియదు. కావున నెంతకాలము నడచితిమో యెఱుఁగము. ఆకలి యైనప్పుడు నేనుఁదెచ్చిన పచ్చిపిండి పంచదారతోఁ గలిపికొని తినువారము. అట్లు నడుమ నడుమ నిన్నటి సాయంకాలమునకు నియ్యడవిలోనున్న యొక పర్వత శిఖరమునకు వచ్చితిమి. ఆ బిల మాకొండశిఖరమున కమరించినట్లా పుస్తకములోనే యున్నది అచ్చటనొక విచిత్రమైన కవాటము గలదు. అది యడ్డము వచ్చినతోడనే యాపుస్తకమును జూచి యది తలుపుగా గ్రహించి తదుక్తపద్ధతిని నా తలుపు తెరచుకొని కొండమీదికి వచ్చితిమి.

అప్పర్వతశిఖరము మీదనుండి చూచినఁ బరమేశ్వరుండైన నాద్వారరహస్యము తెలిసికొనజాలఁడు. అప్పుడు నే నాపుస్తకమునే జీవనౌషధముగాఁ దలంచి దానిఁ గన్నుల నద్దుకొని యాగుమ్మము దాపున నొకచోట రహస్యముగాఁ బెట్టితిని. మరియు నాబిలవిశేషముల పరిమాణములు పెక్కులాపుస్తకములో వ్రాయబడి యున్నవి. కాని యాపత్సముద్రమున మునింగియున్న నాకు వానిఁ బరామర్శింప నిష్టము లేకపోయినది. పిమ్మట నేనొకచేత గుర్రపుకళ్లెము రెండవచేత నామగనిం బట్టుకొని మెల్లన నాకొండశిఖరమునుండి భూమికి దిగి యందున్న మార్గమునంబడి నడువజొచ్చితిమి. కొండ దిగువరకు జీకటిపడినది. అందు నిలిచినచో గ్రూరమృగములు బాధించునేమోయని గుఱ్ఱమును దిగుకయే రాత్రియంతయు నడిచితిమి. ఇట్లు నడచుచు నించుక రాత్రిశేషమున్న సమయంబున శత్రువులచేత జిక్కక బైట బడితిమిగదా? ఇది యాపదలో మేలని తలంచుచు గమ్యస్థాన మరయుచున్నంతలో బ్రాంతమున నొకమూల భయంకరముగా క్రూరసత్వధ్వని యొకటి వినబడినది. దానికి వెరచి యదరిపడి