పుట:కాశీమజిలీకథలు -02.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విశాలాక్షి కథ

25

అప్పుడు మంత్రు లీతడు రాజుగా నుండుటకు దగడనియు వీని బుద్ధిబలము ప్రజల యోగక్షేమములకు సమర్ధము కాదనియు వీనియసామర్థ్యము విని శత్రురాజులు సంఘముగా గూడుకొని రానున్నట్లు చారులవలన దెలియవచ్చినదనియు దీనికి నీవేమి యుత్తరమిత్తువో చెప్పుమని నాకొక పత్రిక నంపిరి. దానిం జదువుకొని యేమి చేయవలయునో తెలియక యాలోచించుచు బ్రత్యుత్తరము పంపుటకు రెండు మూడు దినములు జాగుచేసితిని. ఇంతలో మరల జాబు వచ్చినది. దాని విప్పి చదువుకొనిన నిట్లున్నది, మేము మీకు మూడుదినముల క్రిందట నొక పత్రిక నంపితిమి. దాని కుత్తరము వ్రాసితిరికారు. ఇప్పుడు పెక్కండ్రు రాజకుమరు లొక్కటియై చతురంగబలముతో మన పట్టణము ముట్టడించిరి. వారితో బోర మనకు దగినసేనలు లేవు. ఈ రాత్రి కోట వశపరచుకొందురని ధ్వని పుట్టినది. కావున నిక నెవరిమానము వారు దక్కించుకొనదగినదేగాని వేరుసాధనములేదు! తర్వాత మీచిత్తము అని వచ్చిన రాజుల సంఖ్యయు, నామములు వ్రాసియున్న యాచీటిం బలుమారు శోధించి యోహో ! ఈ వచ్చిన రాజపుత్రులందరు పూర్వము నన్ను వరించినవారే. తమ్ము వరించితినికానని యీర్ష్య మనంబునంబెట్టికొని యిప్పుడు సమయము కనిపెట్టి యూరు ముట్టడించిరి. ఇక మేమిచ్చట నిలిచినచో మమ్ము జెరపట్టక మానరు. కష్టపరంపర లిట్లొండొండు పయింబడుచుండ నొండుదలంపవలసినది యేమున్నది. కానిమ్ము కర్మసూత్రమెట్లుండు నట్లుకాక మానదుగదా ? జీవమున్నంతవరకు జికిత్స చేయవలయును. శాస్త్రరీతి నిప్పుడీకోట నుండి మేము తప్పించుకొనిపోవు నుపాయ మాలోచింప వలసియున్నది. ఇట్టి యాపదలు వచ్చినప్పుడు కోటదాటిపోవ బ్రచ్ఛన్న మార్గంబులు గోటగట్టునపుడుంచు నాచారము గలదు. దీనికి నెందేని దారియుండక మానదని యూహింపుచు కోటలో నలుమూలలు వెదకింపదొడంగితిని. కాని యాకోటనంతయు బరిశీలింపుటకు బెక్కండ్రకు నారుమాసములు పట్టును. అప్పుడు మరల నాలోచించి రహస్యపుస్తములు వెదకింప నొకదానిపై గోటలోని రహస్యముల గ్రంథమని వ్రాసి యున్నది. దానిం బుచ్చుకొని పరిశీలింప శత్రువులు కోట ముట్టడించినప్పుడు వారు లోనికి జొరకుండ జేయ గోటచుట్టును నమర్చియున్న యంత్రముల విషయమై పెక్కు వ్రాయబడి యున్నది. అది యంతయు బశీలింపగ చివరకు పోవబోవ బారిపోవు దారి సంగతి వ్రాయబడియున్నది. దానిని వ్రాసినవారిని బెక్కుగతుల నుతింపుచు దాని రీతినంతయు నిదానముగా విమర్శించి యెవ్వరికిని దెలియకుఁడ రాత్రివేళ నా మగని మాత్రము వెంటబెట్టుకొని ఈ గుఱ్ఱమునకు జీను గట్టించి విలువగల రత్నములు గొన్నిటి మూట గట్టుకొని యాగూఢద్వారము దాపునకు బోయితిని. ఆ గుమ్మముచెంత నమర్చిన యంత్రముల చిత్రమునకు వెరగుపడుచు దాని తలుపు