పుట:కాశీమజిలీకథలు -02.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

24

కాశీమజిలీకథలు - రెండవభాగము

మంత యుగ్రమైనదా అని తలయూచుచు దరంగముల తెరంగున మనంబునం బొడము శోకపరంపరల నణగద్రోయుచు మరల వానితో బాహ్మణుడా! భార్య యనగా నెప్పుడును విడువదగనిది. కావున నీ వెన్నడును నన్నువిడిచి యుండకుము. మరియు నీవు కొన్ని పనుల చేయవలసి యున్నవి. నేను జెప్పినట్లు నడిచెదవా అని అడిగిన దాని కొడంబడినట్లు తలద్రిప్పెను.

పిమ్మట నేను బూవులన్నియు నలుపుకొని మేననెల్ల నఖదంత చిహ్నముల జొదమజేసి పురుషక్రియలన్నియు మేనగనబడ మనంబునం బెక్కుతెరంగుల జింతించుచు స్వయంకృతాపరాధమునకు వగచుచు నీగుట్టు బయలైనచో పదుగురు నవ్వుటయేకాని లాభమేమియు లేదనుచు నైదువతనంబు బాగున్నం జాలునని విరక్తి బూనుచు నొకమంచముమీద బరుండి ధ్యానించుచు నిదురించుచున్నంత నీవు శోకింపవలదు నీకు ముందు మేలయ్యెడినని యొకముత్తైదువ వచ్చి చెప్పినట్లు కల వచ్చినది.

ఆహాహా! ఇట్టివాడు నాకు మగడయ్యుండ నింక రాబోవుమే లెద్దియో? పతిసౌష్టవముగాక సతులకొం డెద్ది సంతోషము నిచ్చును? నన్నుజూచి దైవజ్ఞులు నీవు మిగుల నదృష్టవంతురాలవై మంచి వాల్లభ్యముగలదాన వగుదువని చెప్పువారు. ఈ కలయు వారిమాటలవంటిదే యగునని విరక్తిబూని యుదయంబున లేచి నావెఱ్ఱిమగడు విడిదికి బోయిన వెనుక నా చెలికత్తెల గలిసికొంటిని.

అంతవారు నాయవయవముల బరిశీలింపుచు సఖీ! ఈ రెండు దినములు నీ బతి చమత్కృతి యంతయు దాచితివిగాని యీనాడు దాచలేకపోయితివేమి? నీగుట్టంతయు తెలిసినదిలే. పాప మీ గోరుగీటు లింతమోటుగా నున్న వేమిటి? నీమగనివిన్నాణ మివియే చెప్పుచున్నవి. కొంచెము గంధమలందుదుమా? వాతెర యీ తెరగున నున్న దేమి? రక్తము స్రవించుచున్నది. మేలు మేలు రతిపారవశ్యమంత వింత గాబోలు అన్నన్నా! నీకన్నులు శోకనదశోభ వహించియున్నవి. యించుకయైన నిదురలేదా యేమియని పెక్కుతెరంగుల నన్ను బరిహాసవచనంబుల వేపుచున్నంత వారి మాట లన్నియు నాహృదయశోకాగ్ని కింధనములైనను మరుగుపరుచుచు లేనినవ్వు తెచ్చుకొని యప్పటికి దగిన యుత్తరములు చెప్పి వారినిగూడ సంతసపరచితిని.

అది మొదలా కింశుకశాస్త్రిని బైటికి రానీయక సంతతము నంతఃపురమందె యుంచుకుని యాగుట్టు బైటపడకుండ వానికి నిత్యము లోకవ్యవహారధర్మములు నేరపుచుంటిని. కాని వాని కేదినమున కాదినమే క్రొత్తగా నుండునది ఈరీతి గొన్నిదినము లఱిగినంత మా దురదృష్టవశమున నాతండ్రి హేమాంగదుడు పరలోకగతు డయ్యెను. మాతల్లియు నతనితో నగ్ని జొచ్చినది. పిమ్మట మంత్రులు నామగనికి బట్టాభిషేకము సేసిరి. నిత్యము నేనెంతో బోధజేసినను వాని తెలివితేటలు మంత్రులకే కాక ప్రజలకుగూడ స్వల్పకాలములోనే వెల్లడియైనవి.