పుట:కాశీమజిలీకథలు -02.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విశాలాక్షి కథ

23

ఇప్పుడైనను పొమ్మనిన బోవుదునని యతిమూర్ఖముగా బలుకుచున్న వానిమాటలాలించిన నాకు కొంతసేపేమియు దెలిసినదికాదు.

ఇది స్వప్నమా? నిక్కువమా ఇంద్రజాలమా? విభ్రమమా? యని కొంతసేపు మ్రానువలె నట్లే నిలువంబడి క్రమంబున ధైర్యము గరపుకొని హృదయమా తొందరపడకుము. ప్రారబ్ధ మీరీతినుండ మరియొకలాగెట్లగును. నేఁటితో వీని తెలివియంతయుఁ దేటపడినది. ఈతడు ప్రపంచపుధోరణి యేమియు నెఱుంగడు. దాననే వీని గురువు కింశుకశాస్త్రియని పేరుపెట్టెను. అది గ్రహింపలేక లేనిపోని యర్థములు చేసి గోతిలో బడితిని. నా చెలికత్తె మొదటనే చెప్పినది. దానిమాట యింత యైనను విమర్శించనైతిని. “బుద్ధిః కర్మానుసారణి" అను వచనం బేమిటికిఁ దప్పును. కాకున్న మాతండ్రియైనను బరీక్షింపరాదా! యెరకై భ్రమపడి బడిశమునం దగులుకొనిన మత్స్యములాగున వీని యందమును జూచి మోససోయితిని. వీఁడించుకయైనను లోక ధర్మములను గురుతెరుంగఁడు. కటకటా! కేదారేశ్వరస్వామీ! పెక్కుదినంబులనుండి నిన్నాశ్రయించుదానికి మంచి యుపకారమే చేసితివి. అయ్యో విశాలాక్షీ! నీవరంబునం బుట్టిన నాకిట్టి వెఱ్ఱిమగనిం గట్టిపెట్టితివా? అన్నన్నా! విశ్వనాథా! నీ ప్రేయసి కిష్టురాలనని నీవైనను గొంచము దయయుంచవైతివి. నాకింతవిద్యయు రూపమేటికిఁ గలుగ వలయును. స్త్రీల సౌందర్యము బతిసౌష్టవమే ఫలముగాఁగలదిగదా? ఇంక నా తెలివి తేటల నెవ్వరిముందర వినియోగపరచుదాన. నెవ్వరు సంతోషించిన నేమిలాభము. సంతోషింపఁదగిన వాఁడిట్టివాడైయుండ నేనెట్లు నలుగురులోఁ దలయెత్తుకొని తిరుగుదును. ఈరెండునాళ్ళకే నాసఖులు నన్నుఁ బెక్కుగతుల నిందింపుచున్నారు. వారితో నేమని చెప్పుదును. ఏమిచేయుదును. అని పరిపరిగతులఁ దలపోయుచు నాకునేన యుపశాంతింపరచుకొని కన్నుల నేకధారగా నీరుగారుచుండ నాశవదలక మరలనతనితో నిట్లంటిని.

బాహ్మణుడా! నీతో పరిహాసమున కట్లంటినికాని నీవేమియుఁ గోపము సేయలేదు. నీవెవ్వనికుమారుఁ డవు. నీ దేశమెద్ది! నీ పేరేమి? ఈ గ్రామ మేమిటికి వచ్చితివి? ఇంతకుపూర్వ మేమిచదువుకొంటివి? ఇప్పుడేమి చదువుకొనుచున్నావో యదార్థముగా జెప్పగలవా? అని అడిగిన నతండిట్లనియె. అమ్మా ! అవి యేమియు నాకు దెలియవు. మాగురువుగారు కింశుకశాస్త్రి యని పిలుచుట మాత్ర మెఱుంగుదును. రామశబ్దము చదువుచున్నాను. అది మొదలుపెట్టి యారుమాసములయినది యింకను రాలేదు. ఏదినమున కాదినమే మరచిపోవుచుందునని యుత్తరము సెప్పిన మనస్సు రాయిచేసుకొని నేను వానితో నిట్లంటిని. బ్రాహ్మణుడా! నీవు నన్ను అమ్మ అని పిలువరాదు. నీకు నేను భార్యను. భార్యయన నెట్టిదో యెఱుంగుదువాయన నెఱుంగనని తలద్రిప్పెను. అప్పుడు నేను గుండెలుబాదుకొనుచు భళిరే, దైవమా! నన్నెంత బాగు సేసితివి? నావిలాసములన్నియు నడవిగాసిన వెన్నెలం జేసితివిగదా? నాపూర్వకర్మ