పుట:కాశీమజిలీకథలు -02.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

22

కాశీమజిలీకథలు - రెండవభాగము

నిలబడక వెంటనే యతని మంచము చెంతకు బోయితిని. అంతలో అతడు దుప్పటము సవరించుకొనుచుండెను. నేను బోయి వాని బట్టపట్టుకొని సిగ్గున మాటాడలేక దాపున నిలువంబడితిని.

దానికతండు భయపడుచు లేచి కూర్చుండెను. నేనును మెల్లన గాళ్ళకడ గూర్చుండి పాదము లొత్తబోయిన ముడిచికొనియెను. పిమ్మట నేను గంధము మేనికి నలందబోయిన దుడిచికొనియెను. అప్పుడు నేను ఓహో! మోసమువచ్చినది. మొదటి దినంబున బల్కరించితిని కానని యీతండు కోపమువహించెను. తెలిసికొంటిని. తలంచికొన నాదేతప్పు. మగవారితో సమముగా నాడువాండ్రు పంతము పట్టవచ్చునా? అని పశ్చాత్తాపము జెందుచు నతని మనంబునంగల కోపముదీర్ప నుపాయంబెద్దియో అని యూహింపుచు గొంతసేపు పూసురటిం బుచ్చుకొని వీచితిని మఱికొంత సేపు వీణెం బూని పాడితిని కొంతసేపు శాస్త్రచర్చలధ్వని విశేషముల వెలయించితిని. దేనిచేత నైనను వాని మనస్సు రంజించినట్లు కనబడలేదు.

పిమ్మట బసిడిపళ్ళెరము లోని భక్ష్యములెత్తి చేతికందిచ్చిన నవి అందుకొని తినదొడగెను. దాన గోపముదీరెనని సంతోషముజెందుచు వలదనుదాక నందిచ్చితిని. తృప్తుడైన వెనుక మాట్లాడినం జాలునని పాలొకచేతను నీరొకచేతను బూని పాలు కావలయునా? నీరు కావలయునా! అని అడుగగా బాలున్న చేతిదెస గన్నులు ద్రిప్పుచు సైగజేసెను దానం బక్కున నవ్వుకొనుచు బాలు దాహమిచ్చి వెనుక కప్పురతాంబూలము మడుపుల నోటికందియ్య నందుకొనక చేతితో బుచ్చుకొని నోటిలో ద్రోసికొనియెను.

అదిచూచినంత నాస్వాంతమున గొంతవింత యంకురించినది. కానిమ్ము విచారించెదగాక అని మంచముమీద గూరుచుండ బోయిన నతండు భయపడువానివలె నొకప్రక్కకు నొదిగెను అంత నేను తెగువంబూని ప్రాణేశ్వరా! పెక్కు దినంబుల నుండి మిమ్మువరించి పెద్దయాసతో దరికిరా బల్కరింపక నలుకమై ముసుంగు బిగించి యుండుట న్యాయమేనా? ఒకవేళ నాయందు తప్పున్నను సైపవ యునుగాని బింకము వహించి యుండదగునా? మీరు కోపము బూనిన నేనేమి సేయుదాన నెవ్వరితో జెప్పుకొందును. మన్మథబాణపీడితనై మిమ్ము శరణము వేడెద రక్షింపుడు రక్షింపుడని పాదములంబడిన నా బుద్ధిమంతుడు నాచేతులం బట్టికొనుచు నిట్లనియె.

ఏమమ్మా ! కోపమువచ్చినదా కోపము సేయకుమని పలుమారు తర్కింపుచు నాపాదములం బడుచున్నావు నాకోపపు పను లేమికనుంగొని యిట్లంటివి. నీవుపెట్టిన యప్పములం దింటిని తాంబూలము నమిలితిని పాలు త్రాగితిని యింకేమి సేయవలయును. నీవు గొప్పదానవు నాకాళ్ళుముట్టిన వలదనుట తప్పా! పెండ్లి చేసెదమని తీసికొనివచ్చిన వచ్చితిని కాని నీవిట్లు నిందింతువని తెలిసిన మొదటనే రాకపోవుదును.