పుట:కాశీమజిలీకథలు -02.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విశాలాక్షి కథ

21

మీరు సిగ్గుమాలినవారలు మీకుత్తరము చెప్పనని అప్పటికి దగినట్లు మాట్లాడుచు వారెంత గ్రుచ్చి గ్రుచ్చి అడిగినను నాగుట్టు చెప్పితిని గాను.

అంత మరునాడు రాత్రి యెప్పటివలెనే నన్నలంకరింపుచు దాచినం దాగవని కేళీచిహ్నంబులం గురుతుపట్టుటకై నాడు కేవలము పుష్పాలంకారములే నామేన నుంచిరి పూర్వమురీతి నాతలిరిబోండ్లు తలుపు మూసి పోయిన వెనుక నేనును తలుపుదాపున నిలువంబడి యోరజూపుల జూచుచుండు నంతలో నమ్మానుభావుని గుఱ్ఱు వినంబడినది.

అప్పుడు నేను బెక్కుతరంగుల దలపోసితిని. అన్నన్నా! ఈ విజ్ఞాని శుకాది మహర్షులకన్న నధికుడువలె దోచుచున్నవాడు. ఎట్టివారైనను నావంటి వాల్గంటు లెదురనిలిచినపుడు మనంబాపగలరా? విశ్వామిత్రుండంతటివాడు తపముచెడి స్త్రీలోలు డయ్యెను. వీనిధైర్యము కొనియాడదగినదే. ఇక నే నూరకొనిన నతడు మాటాడడు. సిగ్గుపడిన లాభములేదు. పురుషుల పంతము చెల్లును గాని స్త్రీలపంతము లెప్పుడైనను చెల్లునా? నేనే పల్కరించెదఁగాక యని దాపునకు బోయి నిద్రాభంగము సేయవెరచి రేపుతప్పక నితడు నిద్రింపకపూర్వమే పల్కరించెద నీరేయి నెట్టకే గడపెదనని నిశ్చయించి నాయలంకారమంతయు మంచము పాలు చేసి యారాత్రి వెళ్ళించితిని.

మూడవనాటి యుదయమున నతండు విడిదికి బోయిన వెనుక నా ప్రాణసఖులందరు తత్తరముతో నన్ను జుట్టుకొని పూవుదండల బరీక్షించి యెప్పటియట్ల నుండుటకు ముక్కు మీద వేళ్ళు వైచుచు నొకరిమొగ మొకరు చూచుకొనదొడంగిరి.

అప్పుడు నా ప్రాణసఖులలో ప్రౌఢురాలు చిత్రావతి అనునది నాకిట్లనియె చెలీ! నీమేనుజూడ నేపోడిమియుం గనంబడకున్నది. ఇట్టిదంపతుల నెందునుం జూడలేదు. నీవు నపరసరసికురాలవు. సకలకళాప్రవీణురాలవు. చిన్నదానవు కావుకదా? నీకు దెలిసిన సంగతులు పండితులైనను దెలిసికొనజాలరు. ఇట్టి నీవే లజ్జావతివై యూరకుండినచో మేమేమి చెప్పగలము. మగవాడు సిగ్గుగలవాడైనప్పుడు మగువయు లజ్జావతియైన నెట్లు పొసంగను! నీకు మేము బుద్ధులు సెప్పువారమా? ఇది నీ లోపమా? యతని లోపమా! తెలుపుమని పెక్కుగతుల బుజ్జగించి అడగిరి. నేనేమియు నుత్తరము చెప్పక వేరొకరీతి మాటలచే దాటవైచితిని.

అంత మూడవనాటి సాయంతనమున సఖులు నన్ను జక్కగా నలంకరింపుచు పుత్రీ! నీవీరాత్రి పూర్వమువలెనే గడిపితివేని మేము మీయమ్మకు జెప్పక మానము. అయినను నీవు పూర్వమువలె మాతో మనసిచ్చి మాట్లాడకుంటివి. చక్కని మగడు దొరకెనని గర్వమువచ్చినది. నీవిట్టిదానవగుదువని యెన్నడు ననుకొనలేదు. కానిమ్ము రేపుగూడ బరీక్షించి తర్వాత నాలోచించెదములే యని పల్కి యారాత్రి గదిలోనికినంపి కవాటము తటాలునమూసిరి. నేను పూర్వమువలె తలుపుదరి