పుట:కాశీమజిలీకథలు -02.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

20

కాశీమజిలీకథలు - రెండవభాగము

చుట్టును విచిత్రవస్తువులు పెక్కు గాజుదీపపుకాంతులు వింతలుగుల్కుచుండ నమర్చిరి. పెక్కేల నాగదియలంకారమంతయుంజూచి తీరవలయుగాని చెప్పశక్యము గాదు.

రాజా ! నీవు నాకు దండ్రివంటివాఁడవు. ఇది యాపత్కాలమునగుటచే నిటుమీద జరిగిన చర్యలను సిగ్గువిడిచి చెప్పుచుంటిని. గాని మీబోటివారికి జెప్పవలసినదిగాదు. మనంబునఁ బెక్కురీతులఁ గోరిక లువ్విళ్ళూర నాదివసంబున సాయంకాల మగుటకు నాకు గడియ యుగముగాఁ దోచినది. నావయస్య లాదినంబున నాకుఁ జేసిన యలంకార ప్రకారమంతయుఁ చెప్పుటకొక సంవత్సరము పట్టును. నిత్యము చూచుచున్నవారే నాసోయగమునకు గ్రొత్తవింత పడజొచ్చిరి. అంత నారాత్రి మా తండ్రి యాజ్ఞచొప్పున నా గదిలో దాంబూలచర్వణచందనానులేపనాది స్త్రీజనకృత్యము లన్నియు లఘువుగా జరుగుటచే జిరకాలమునుండి తలంచుకొనుచున్న నావయస్యల కోరికలేమియు దీరినవికావు.

పిమ్మట దమవెంట వచ్చుచున్న నన్ను లోనికి ద్రోసి బలత్కారముగా దలుపు బిగియించి నా చెలికత్తె లరిగినవెనుక నేనును దలుపు దాపున దలవంచుకొని నిలువబడితిని. ఎంతసేపట్లు నిలిచినను నన్ను బల్కరించినవారు లేరు. గొంతసేపునకు నేనే మెల్లనతలయెత్తి చూడ నా మహాపురుషుండు దుప్పటము ముసుంగుదన్ని యాతల్పముపై గుఱ్ఱువెట్టి నిదురించుచుండెను.

ఆ గుర్రువిని నేను వెరగుపడుచు మంచము దాపునకు బోయి యోహో ! యీతండు నన్ను బరామర్శింపక యిట్లు గాఢనిద్ర జెందుటకు గారణమేమియోగదా ? నాయందు వీనికి మక్కువ లేదా ? లేక యలసటచేత నిట్లు నిద్రించుచున్నవాడాయని యాలోచించుచు కానిమ్ము. నేనుమాత్రమంత తేలికపడనేల. నేటికూరకొని రేపు చూచెదంగాక అని యారాత్రి వేరొక మంచముమీద బరుండి నిద్రబోయితిని.

అతండును తెల్లవారకుండలేచి పరిచారకులు సేవింప విడిదికింబోయెను. ఆరాత్రియంతయు వృథయయ్యెనని వగచుచుండ నా సఖులు నన్ను జుట్టుకొని నా యంగములన్నియు బరీక్షింపుచు బెదవులు విరిచిరి.

శ్లో॥ కస్తూరీ వరపత్ర భంగనికరో భ్రష్టొ న గండస్థలె
     నోలుప్తం సఖి చందనం స్తనతటె ధౌతం ననేత్రాంజనం
     రాగో నస్ఫలిత స్స్తవాధరపుటె తాంబూల సంవర్దితో
     కింరుష్టోసి గజేంద్రమత్తగమనే! కింవా శిశు సైపతి!

ఓహో, చెలీ ! పెక్కు విద్యలం జదువంబట్టియా యిట్టి విలాసముల జూపితివి. మేని అలంకారములేమియు గలుగక పెట్టినవి పెట్టినట్లే యున్నవి. పుష్పములు వాడలేదే, నఖదంతచిహ్నము లెందునుంగానరావు ఇది నీ చమత్కృతియా? నీమగని పాటవమా? తేటపరుపుము. లజ్జావతీ? అని పరిహాసము సేయుచుండ పోపొండు