పుట:కాశీమజిలీకథలు -02.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విశాలాక్షి కథ

19

లాటకు రాలేదు. కార్యముగలిగి వచ్చితిని. యథార్థము చెప్పుడని నేనెంతవేడినను మారుమాట జెప్పక పిలుచుచుండగనే లక్ష్యముజేయక యతండు లేచిపోయెను.

అంతట నేనేమియు జేయునది లేక వాని మాటలనే మాటిమాటికి స్మరించుకొనుచు నీయొద్దకు వచ్చితిని. వాని చర్యల జూడ వెఱ్ఱివాడువలె దోచుచున్నవాడు. అతండు నీకు దగడని నుడివినది. దాని మాటల విని నేను ఓహోహో! బుద్ధిమంతురాలా! నేటితో నీబుద్ధిబలంబంతయు దేటమైనది. నిన్ను మిగుల చతురవనుకొంటిని. చాలులే అతండు గంభీరహృదయుండును, ధీరుండును మీబోటి బోటులకు దనహృదయంబు దేటపడనిచ్చునా? వానిశ్లేషవచనంబులు నీవు గ్రహింపలేకపోయితివి. వాని యర్థము నేను జెప్పెదనువినుము. విద్వాంసుల కొకదేశము, ఒకనామము స్థిరముగా నుండదు. సర్వదేశములు సర్వనామములు నావేయనియర్ధము. శబ్దములు చదువు చున్నాననగా సకలశాస్త్రములు శబ్దకాలమే కావున నట్లనెను. మఱియుం గింశుకశాస్త్రి యనగా మోదుగపూవు వంటివాడనని స్వాతిశయశూన్యోక్తి గొప్పవారు ఆత్మస్తుతి జేయనొల్లరు. అభిజ్ఞులు సమానులతో గాని మనసిచ్చి మాట్లాడరు. నీవది గ్రహింప లేక వెఱ్ఱివాడని సులభముగానంటివి. పోపొమ్మని దానిని దిరస్కరించి వానిని నేను బెండ్లియాడక మాననని తదాయత్తచిత్తురాలనై మన్మథావస్థలకు బాల్పడితిని.

పిమ్మట నొకనాఁడు దాసీముఖంబున నాయవస్థయంతయు విని మాతల్లి నా యొద్దకు వచ్చి మదీయమనోగతంబడిగి తెలిసికొని మా తండ్రితోఁజెప్పెను. ఆతండు మిగుల సంతసించుచుఁ దక్షణము ఆ విప్రకుమారునిందోడ్కొని రండని దూతలం బుచ్చిన వారేఁగి తోడ్కొని వచ్చిరి. మా తండ్రి యంగజునిబోలియున్న యా చిన్నవానిని జూచి వెరగందుచు నోహో! యీ మోహనాంగుఁ డీయూర నెంతకాలము నుండి యుండెనో. యిట్టి సుందరుఁ డింత చేరువనుండఁ దెలిసికొనలేక యూరక శ్రమపడితిని. నాయందు మక్కువఁగల విశ్వనాధుండే యిక్కు మారునిం దెచ్చియిచ్చెను. నాకూఁతునకుఁ దగినవరుడు లబించెనేఁడుగా కృతార్థుండనైతినని పెక్కురీతులఁ గౌతుక మందుచు విద్యావిషయ మింతయేనిం పరీక్షింపక వానికి నన్నిచ్చుటకు నిశ్చయించి తగు ప్రచారకులతో వానినొక విడిదికిఁబంపెను

పిమ్మట సిద్ధాంతులచే నిర్దిష్టమగు సుమహూర్తమున మిగుల వైభవముతో నా తండ్రి మాకు వివాహము గావించెను. అతని నా యూరిలోని వారెవ్వరుఁ గింశుక శాస్త్రియని గురుతెఱుంగరు. ఎచ్చోటనుండియో చక్కని రాజకుమారుఁ డొక్క రుండు రాజపుత్రికకుఁ దగినఁవాడు దొరికెనని సంతసింపుచు నతని సౌందర్యమును వేతెరంగుల స్తుతిఁజేయ దొడగిరి.

అంత వివాహదీక్షావసానదివసంబున విలాససౌధంబు చక్కగా నలంకరించిరి. పవడపుఁకోళ్ళును బంగారుపందిరి ముత్తెముల జాలరు పట్టుదోమతెరయుఁ దంతపువింతనగిషియుం గలిగి హంసతూలికాతల్పముచే నింపుగాంచిన మంచము