పుట:కాశీమజిలీకథలు -02.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

18

కాశీమజిలీకథలు - రెండవభాగము

యుండుటకు గతంబేమియో గదా ? ఔనౌను తెలిసికొంటి వీనియోష్టంబులు పరిశీలింప బెక్కుశాస్త్రంబులు చదివినట్లు తోచుచున్నది. బ్రాహ్మణునికి విద్వత్తు గలుగుటయే రాజయోగమందురు. ఇట్టిసుందరు డీయూరనే యుండ నా తండ్రి బెక్కుదూరము వెదుకనేల? వీనియునికి దెలియకగాబోలు వీనిని జూచినది మొదలు నిర్దుష్టమగు నా మనంబు మదనావేశము జెందుచున్నది. భక్తజనపరాయణుడగు కేదారేశ్వరస్వామియే వీనిలనాకొరకు దెచ్చెనని తలంతు. విద్యారూపంబులుగల వీనియందు సంపద్విచారము చేయనేల? నేను వరించినచో మా తండ్రి రాజ్యంబున కీతడే యధికారి యగును గదా, కావున నేను వీనిని ద్రికరణంబులచే బతిగావరించితి. ఈతడే నాకు బతియని నిర్దేశించుకొని వానికులశీలనామంబులం దెలిసికొనిరమ్మని బ్రచ్చన్నముగా మదీయప్రాణసఖి నొకదానినంపి కేదారేశ్వరు నారాధించి యింటికి బోయితిని.

రాజేంద్రా! స్త్రీజనస్వభావం బెంతచాంచల్యమైనదో చూచితివా! ఎంత చదివినను వివేకములేక నే నతని జూచినంతనే వరించితిని. కులశీలంబులు దెలియునంత దనుక తాళలేకపోతిని. అట్లు నేనింటికి బోయి చెలికత్తెరాక వేచుచున్నంత నంతలో నది వచ్చినది దానిని జూచి నేనత్యాతురముగా చెలీ! నీవాయనతో మాట్లాడితివా? ఏమి ప్రసంగము జరిగినది? నీకతండేమియుత్తరము చెప్పెను? పండితుండౌనా! ఆ సుముఖుని ముఖమునుండి వెడలిన వర్ణముల గ్రమము దప్పకుండ నుడువుము. నీ ముఖవిలాసముజూడ వేఱొకలాగు దోచుచున్న దేమి? వేగమె యచ్చటి విశేషముల దెలుపుమని తొందరపెట్టిన నది నాకిట్లనియె.

బోటీ! నీ వేమిటికూరక తొందరపడియెదవు? క్రొత్తవాని యంతస్సారం బెరుంగక వరింపవచ్చునా? మనమెంత ప్రౌఢలమైనను బెద్దవారల యనుమతిలేక స్వతంత్రింపరాదు అచ్చటిచర్యల జెప్పెద వినుము. నేను పండితమండనులదండకు బోయి దండప్రణామంబులు చేయుచు వారిచే మన్ననలవడసి కొంతసేపు వారివాదముల నాకర్ణింపుచు బ్రాంతమున నిలువబడితిని. నీవు కోరిన చిన్నవా డెద్దియేని బ్రసంగించునేమో యని యెంతసేపు నిలిచినను వానినోటినుండి యొక మాటయైనను వచ్చినది కాదు. వారివాదములనైన వా డెరింగినట్లు నేను తలంపను. వారు ప్రసంగమ్ముల ముగించిన పిమ్మట నందరు లేచి నివాసములకు బోయెడితఱి నేనా బ్రాహ్మణకుమారుని నించుక చాటుగా జీరి, అయ్యా! తమ నివాసస్థలమెచ్చట! మీ పేరేమి! యేమిటికై యీపట్టణమునకు వచ్చితిరి? ఏమి చదువుకొంటిరని యడిగితిని. అప్పు డాయన నాతో జెప్పిన దేమనగా, “నాగ్రామము పేరు నాపేరు నాకు దెలియదు. నే నేమి చదుకొన్నది యెఱుంగను. ఇప్పుడు శబ్దాలు చదువుకొనుచున్నాను. మాగురువుగారు కింశుకశాస్త్రి యని మాత్రము నన్ను బిలుతురు." అని యుత్తరము జెప్పెను.

ఆమాటలకు నేను వెఱగుపడుచు అయ్యో! గ్రామము పేరు తనపేరు మరచువారుగలరా? మీమాటలుచూడ బరిహాసముగా దోచుచున్నవి. నేను మీతో నవ్వు