పుట:కాశీమజిలీకథలు -02.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విశాలాక్షి కథ

17

తండ్రీ! వరునియందు విద్యాశీలరూపసంపదలు ముఖ్యముగా నరయఁదగినవిగదా అందు మొదటిది విద్య! శాస్త్రపాటవము లేనివానిమనం బెంతవిన్నామ మైనను అగ్నిశోధితముగాని బంగారుచందమునఁ బ్రకాశింపనేరదు. బుద్ధిహీనుండగు వాఁడు మిగులసంపదఁగలవాఁడైననుఁ జెడిపోవును. శాస్త్రచక్షుస్సు దివ్యమైనది. భూతభవిష్యద్వర్తమానవిశేషములఁ జూడనోపును. విశాలనేత్రములు గలవాడయ్యును శాస్త్రప్రజ్ఞ లేనివాఁడు అర్థదర్శనముల యందు సామర్థ్యము లేకపోవుటచేత గ్రుడ్డివాఁడే యగును. కావున విద్యాబలసంపన్నంబగు బుద్ధిచే నొప్పువాఁ డుత్తముఁ డనంబరగును. రెండవది శీలము - శీలములేనివాఁ డెంత విద్వాంసుడయ్యును పన్నగశిరోమణియుంబోలె వాసి కెక్కనేరడు. మూడవది రూపము "యత్రాకృతిస్తత్రగుణాభవంతి" యను నార్యోక్తి చొప్పున సాముద్రికశాస్త్రదృష్టంబైన రూపముగలవాని కన్ని గుణములు పుష్పపరిమళముభాతి సహజంబులై యుండును నాలుగవది సంపద. త్యాగభోగము కది యావశ్యకము. ఇందు రెండవది లేక తక్కినవి గల్గియున్నను గర్వహేతుకములై యపయశము గలుగఁజేయును. మొదటిమూడునుం గలిగి నాలుగవది లేకున్నను నెప్పటికేని వీనిచేఁ దానిని బడయవచ్చును. లౌకికమర్యాదాభిజ్ఞులకు మీకు నేను జెప్పుదాననా. అయినను నాకుఁదోచినది వక్కాణించితిని. పిమ్మట మీ యిష్టమని వ్రాసి పంపితిని, ఆజాబు చదువుకొని యతం డెంతేని సంతసము జెందుచు నీభూమి నంతయుం బరిశీలించియైన దీనికిఁదగినమగనిఁ బెండ్లి చేయుదునని నిశ్చయించి నానాదేశములకుం దగిన దూతలఁబంపెను. నే నొక్కనాడు సాయంకాలమున ప్రాణతుల్యులగు చేడియలు తోడరాఁ బల్లకినెక్కి కేదారేశ్వరు నారాధింప బోవుచుండ నా ఘట్టంబున గంగాతీరంబున సౌపానంబులంగూర్చుండి కొందరు విద్వాంసులు భాగీరథీనీర జరాగచోరకంబులగు మలయమారుత కిశోరకములు మేనులకుహాయి సేయ శాస్త్రవాదంబులు చేయుచుండఁ దన్నాదంబులు మదీయ కర్ణగోళములకుఁబండువులగుటయు నాందోళికము నించుకయాపి తదీయగవాక్షవివరములనుండి తొంగిచూచితిని. అప్పుడా విద్వన్మండలమునడుమ జుక్కలలో చంద్రునివలె నొక్క బ్రాహ్మణకుమారుడు నాకు నేత్రపర్వమై తటాలున నామానసమాకర్షించెను. ఈశ్వరునివరము జేసికొన గంగాతటంబునకు దపముసేయ నరుదెంచిన కంచువిల్తుడోయన మనోహరవేషంబున నొప్పు నక్కుమారశేఖరుని జూచి స్వాంతముని నేనిట్లని తలంచితిని కంతువసంత జయంతాదుల సుందరులని చెప్పుటయేకాని వారిని జూచినవారు లేరు. వారు వీనివలె సర్వాంగంసౌష్టవము గరవారని తోచదు. అయ్యారే! వీనియవములన్నియు లావణ్యభూయిష్టములై మొలచినయట్లున్నవి. కలకలనవ్వు మొగంబును సొగసైన కన్నులు సుందరఫాలము, చక్కనిచెక్కులు, విశాలమైన వక్షము, దీర్ఘములైన బాహువులుంగలిగి సాముద్రికశాస్త్రలక్షణంబుల సార్వభౌముండుగా నుండదగు నీతం డిట్లు దైన్యంబు నొంది