పుట:కాశీమజిలీకథలు -02.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

16

కాశీమజిలీకథలు - రెండవభాగము

శోకాలాపంబులు మదీయకర్ణపుటంబులఁ గటువులై చొచ్చుటయు నొచ్చినడెందముతోఁ గారణంబరయ నిందు వచ్చితిని. నన్నన్యునిగాఁ దలంపకుము. నీ తండ్రివంటివాఁడ. నాయోపినంత యుపకారము సేసెద. నీ వృత్తాంత మాద్యంత మెఱింగింపుమని పలుదెఱంగులఁ బ్రతిమాలుచున్న యన్నరపతి యనునయవచనంబులఁ దనహృదయశోకం బించుక శాంతింప నవ్విద్రుమోష్టి తన యుద్యమం బుడిగి కన్నీరుఁ దుడుచుకొనుచు దదీయవిఖ్యాతి నంతకుమున్ను వినియున్నది కావున నతం డట్టివాఁడుగా నిశ్చయించి చూపులఁ దైన్యంబుఁ తోప లేచి మ్రొక్కుచుఁ దనవృత్తాంతం బిట్లని చెప్పందొడంగెను .

విశాలాక్షి కథ

ఆర్యా! మందభాగ్యురాలనగు నా వృత్తాంతము వినుటచే దేవరచిత్తము దుఃఖభాజనము కాకమానదు. అయినను దీనుల మొఱలాలించుట యుత్తమధర్మము గదా. నాకీసమయములో మరణమే శరణమై యున్నది. బలవన్మరణము నిరయకారణ మని వినియుండియు నిట్టితెగువునకుఁ బూనుకొంటిని. చింతసాగరంబు మునింగియున్న జనులకు బంధుదర్శనము తెప్పయగునని యార్యులు చెప్పుదురు మీ మాటలచేతనే నా సంతాపము కొంతచల్లారినది. నాయిడుములతెఱం గెఱింగించెద నాలింపుము.నేను హేమాంగదుఁడని ప్రసిద్ది వహించిన కాశీరాజుకూతురను. నా పేరు విశాలాక్షి యందురు. మా తల్లి యొక్కనాఁడు సంతతిలేమిఁ జంతింపుచుఁ న్నంతరంగమున ధ్యానించి నిదురించినంత జగద్రక్షణియగు విశాలాక్షి కలలోఁ బ్రత్యక్షమై నన్నిచ్చుటచే నాకద్దేవిపేరు పెట్టిరి. కటకటా! ఆఘటనాఘటనసమర్ధురాలగునట్టి దేవి వరంబునం బుట్టియు నిట్టి బాధలంబడుచుంటిని. ప్రారబ్దం బెట్టివారికిని దాటశక్యముగాదను మాట యథార్ధము లేక లేక కలిగిన దాననగుట నా తల్లిదండ్రులు నన్ను గారాబముగా బెంచిరి. కాశీపురము విద్యామందిరమనుమాట జగత్ప్రసిద్ధమైనదే కద! పూవునకుఁ దావింబోలె నారూపము నీకనురూపముగా విద్యయుండినచో నలంకారముగా నుండు నని యూహించి మా తండ్రి మాటలు వచ్చిన నాటఁగోలె నవ్వీటగల మేటిపండితులఁ బిలిపించి నాకువిద్యఁ జెప్పింప దొడంగెను. దానంబట్టి ప్రాయముతోఁగూడ విద్యయు నభివృద్ధిఁబొందెను. విద్వాంసులు మదీయగహణధారణసామర్ధ్యమునకు వెఱఁగందుచుండిరి. పదియారేఁడుల ప్రాయమువచ్చువరకు నాకు విద్యలన్నియు బూర్తియైనవి.

అప్పుడు మా తండ్రి మిగుల సంతసించుచు గురువులకు దగిన పారితోషికము లిప్పించి నాకనురూపుండగు వరుఁడెవ్వడో యని విచారింపదొడంగెను. ఒక్కొక్క రాజకుమారునియం దొక్కొక్క గుణమేకాని యన్నిగుణములఁ గలిగిన వాఁడెందునుఁ బొడఁగట్టలేదు. మా తండ్రి యొకనాఁడు దూతికాముఖంబున నీకెట్టివాఁడు పతికావలయునో చెప్పుమని యడిగిన నేనిట్లుత్తరముఁ వ్రాసితిని.