పుట:కాశీమజిలీకథలు -02.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంద్రద్యుమ్నుని కథ

15

బునం బురంబునకుఁ బోవచ్చునని పలుకుచు వలలచేఁ బొలియకుండబట్టిన వింతమృగంబులం దెప్పించి యెదుర పెట్టించెను.

వానిని జూచి యరాచమన్నీఁడు వేడుకపడుచుఁ దద్విశేషంబుల భార్య కెఱింగింపుచు నప్పటికిఁదగిన కానుక లామృగయుల కిచ్చి మఱలఁ బురంబునకుఁబోవ సేనల సన్నాహపరచుఁడని యాన తిచ్చుచున్న సమయంబున ననతిదూరములో, “హా! ప్రాణనాథ! హా! జీవితేశ్వరా! యేమైపోయితివోగదా? కటకటా! యూరక నీకు మృత్యుదేవతనై తోడ్కొనివచ్చితిని. అయ్యయో! ఎంత పాపాత్మురాలను? పరిశీలింపక నేలపాలు సేసితినే" అని యేడ్చుచున్న యార్తధ్వని యొండు వినంబడినది.

దానికందరును వెరగుపడుచు దలలుపైకెత్తి యాదీనారవంబు ఏతెంచిన దెసకు గర్ణములం జొసిపిరి, మరల నారీతినే వినంబడుటయు నదరిపడి యప్పుడమియొడయుండు వడిగలవారల బిలిచి యది యేమియో సరగున నరసిరండని పనిచిన వారునుంబోయి తద్విధంబంతయు దెలిసికొనివచ్చి యిట్లని విన్నవించిరి, దేవా ! దేవరయానతి మేమా రొదజాడబట్టి వేగమెపోవ నా త్రోవదాపున చెట్టునీడ నొకచేడియ కనబడినది. ఆతొయ్యలి తనపయ్యెద చెరంగు మెడకు బెనివైచికొని చెట్టుకొమ్మకు తగిలించి ప్రాణనాధునిదలంచుచు ప్రాణముల బోగొట్టుకొన నుద్యోగింపుచున్నయది అట్టితెగువకు వెరగందుచు మేము సత్వరంబును నా చేలము గంఠము బిగియకుండ జిక్కబట్టుకొని యబలా! నీ వెవ్వతెవు! ఇట్టి ఘోరసాహసమేల జేసెదవు. నీపతి యే మయ్యె నెఱింగింపుమని మేమెంత బ్రతిమాలి యడిగినను మాకు బ్రత్యుత్తరము చెప్పినది కాదు. ఆమె ప్రక్కనొక్క చక్కనిగుఱ్ఱము పెక్కుదూరము నడిచివచ్చినట్లు మేనెల్లం జెమ్మటలుగ్రమ్మ నొగర్చుచు నిలువబడియున్నది. అయ్యారే! అయ్యెలనాగసోయగం బేమని వక్కాణింతుము. దివ్యాంగన యని తోచుచున్న యది. దానిమాట పిదప విమర్శించుకొనవచ్చును. వేగమె యా మగువ సమయకుండ దేవర విచ్చేయవలయునని పలికిరి. దీనజనుల రక్షింప గంకణము గట్టుకొన్న యన్నరనాయకశిరోమణి వారిమాట విని సత్వరము తురగ మెక్కి చంద్రసేన వలదు వలదు, నన్ను గూడ గొనిపొమ్ము. కొనిపొమ్మని బ్రతిమాలు కొనుచుండ వినిపించుకొనక వడిగా నప్పడతియున్న విటపినికటమునకు బోయెను. అట్లా భూపుం డరుగునప్పటి కత్తలిరుబోడి నా చేలమువిడుపుడు. విడువుడు పాపాత్మురాలిని ముట్టకుడని పెనుగులాడుచుండ నాదండకు బోయి మెల్లన మెడయురి దప్పించి చల్లనిపలుకుల నిట్లనియె.

తల్లీ! నీ తల్లిదండ్రు లెవ్వరు? ఎవ్వనియిల్లాలవు? నీ పేరెయ్యది? అనన్యసామాన్యరూపలావణ్యములుగల నీ వంతఃపురములఁ జేటిక లూడిగములు సేయ నివసింపక యొంటియై నీయరణ్యమునకుఁ రాఁగతంబేమి? నీ కాపురమెచ్చట? నీ చందమరయఁ బతివియోగంబున శోకింపుచున్నట్లు కనంబడుచున్నది. నే నింద్రద్యుమ్నుండనువాఁడ. క్షత్రియకులుండ. వేఁటకారణంబునఁ నీ విపినంబు జేరితి. భవదీయ